చెక్కుచెదరని వైసిపి ఓట్ల శాతం 

గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకొంటే అధికార పక్షం వైసిపి ఓట్ల శాతం చెక్కుచెదరలేదని మునిసిపల్ ఎన్నికలలో ఓట్లశాతం వెల్లడి చేస్తున్నది. పైగా స్వల్పంగా పెంచుకోగలిగింది. మరో వంక టిడిపి ఓట్ల శాతం సుమారు 10 శాతం తగ్గింది. 
 
ఆదివారం విడుదలైన ఫలితాల్లో 73 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలతో పాటు. 11 కార్పొరేషన్లనూ వైసిపి తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఫలితాల్లో టిడిపి చతికిలపడిపోయింది. ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్‌ వచ్చిందనే అంశాలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెల్లడించింది.
 

అందులో వైసిపికి అత్యధికంగా 52.63శాతం ఓటింగ్‌ వచ్చింది. ఇది గత మున్సిపల్‌ ఎన్నికలతో పోల్చుకుంటే ఎక్కువ. టిడిపికి 30.73శాతం వచ్చింది. ఇది గత మున్సిపల్‌ ఎన్నికలతో పోల్చుకుంటే చాలా తక్కువ. 

 
జనసేనకు 4.67 శాతం,  బిజెపికి 2.41 శాతం, ఇండిపెండెంట్లకు 5.73 శాతం, నోటాకు 1.07 శాతం, సీపీఐ 0.80 శాతం, సీపీఎం 0.81 శాతం, కాంగ్రెస్‌ 0.62 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. 97.33 శాతం మున్సిపాలిటీలలో అధికార పక్షం పాగా వేయగలిగింది. గతంలో రాష్ట్రంలో మరే పార్టీ ఇంతటి ఘన విజయాలను సాధింపలేదు.
 
2014లో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 939 వార్డుల్లో గెలిచింది. అప్పటి ఎన్నికల్లో 36.52 శాతం వార్డులను కైవసం చేసుకుంది. టీడీపీ 1,424 వార్డుల్లో గెలిచి 55.39 శాతం వార్డుల్లో విజయం సాధించింది. కాగా ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఏకంగా 2,265 వార్డులను కైవసం చేసుకుంది. 81.07 శాతం వార్డుల్లో విజయ దుందుభి మోగించింది. టీడీపీ కేవలం 348 వార్డులకే పరిమితమైంది. ఆ పార్టీ కేవలం 12.70 శాతం వార్డులతో సరిపెట్టుకుంది.