మరో 6 కోవిడ్ వ్యాక్సిన్లు వస్తాయి

భారతదేశంలో మరో 6 కోవిడ్ -19 వ్యాక్సిన్లు రాబోతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ శనివారం ప్రకటించారు. ఇప్పటివరకు 1.84 కోట్ల మందికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ డోస్‌లు వేసినట్లు మంత్రి చెప్పారు. 23 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

భారతదేశం రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిందని, వాటిని 71 దేశాలకు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇంకా అనేక దేశాలు కరోనా వ్యాక్సిన్ కావాలని కోరుతున్నాయని ఆయన తెలిపారు. కెనడా, బ్రెజిల్‌తోపాటు మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత వ్యాక్సిన్‌ను వాడుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. నిన్న 20 లక్షల మందికి కరోనా టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రి వెల్లడించారు.

ఇలా ఉండగా, భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఓ వైపు వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్నా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 25,320 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. 

తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,59,048కు పెరిగింది. కొత్తగా 16,637 మంది వైరస్‌ నుంచి డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,09,89,897 మంది కోలుకున్నారని తెలిపింది. మరో 161 మంది మృత్యువాత పడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,607కు చేరింది. 

ప్రస్తుతం దేశంలో 2,10,544 యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,97,38,409 డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా తాజా విజృంభణకు వైరస్‌లో జరిగిన కొత్త ఉత్పరివర్తనాలా?  లేక ప్రజల నిర్లక్ష్యమే కారణమా? అన్నదానిపై అధ్యయనం చేస్తున్నట్టు సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ రావడానికి సమయం పడుతుందని చెప్పారు.

లవ్లీ ప్రొఫెషనల్‌ వర్సిటీ డీన్‌ మోనికా గులాటీ మాట్లాడుతూ.. పలు దేశాల్లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ రకాలు (వైరస్‌ స్ట్రెయిన్స్‌) అసలైన దాని కంటే ప్రమాదకరంగా ఉన్నాయని, ఆయా దేశాల్లో సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్నదని చెప్పారు. అయితే భారత్‌లో కరోనా తీవ్రత ప్రస్తుతానికి అంతగా లేదని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భోపాల్‌, ఇండోర్‌ జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఆదివారం లేదా సోమవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రావొచ్చని ఆయన తెలిపారు. మరోవైపు, కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను కొన్నాళ్ల పాటు తెరువవద్దని పంజాబ్‌ ప్రభుత్వం ఆదేశించింది. అంగన్వాడీ కార్యకర్తలు ఇంటి వద్దకే వచ్చి సేవలందిస్తారని ప్రకటించింది.