పాలక్క‌డ్ నుంచి బ‌రిలో మెట్రోమ్యాన్‌ శ్రీధ‌ర‌న్

కేర‌ళ‌లో మొత్తం 140 అసెంబ్లీ స్థానాల‌కుగాను త‌మ పార్టీ 115 స్థానాల నుంచి బ‌రిలో దిగనున్న‌దని బీజేపీ జాతీయ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి అరుణ్‌సింగ్ తెలిపారు. మిగిలిన 25 అసెంబ్లీ స్థానాల‌ను నాలుగు మిత్ర‌ప‌క్ష పార్టీల‌కు విడిచిపెట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 

జాబితాలోని ముఖ్యుల్లో కేర‌ళ బీజేపీ అధ్య‌క్షుడు కే సురేంద్ర‌న్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీచేస్తున్నార‌ని, అందులో ఒక‌టి కాస‌ర్‌గోడ్‌లోని మంజేశ్వ‌ర్ కాగా, రెండోది పత‌‌నంథిట్ట‌లోని కొన్నీ నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని అరుణ్‌సింగ్ చెప్పారు. ఇక‌, ఇటీవ‌ల బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ ఈ శ్రీధ‌ర‌న్ పాల‌క్క‌డ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నార‌ని అరుణ్‌సింగ్‌ తెలిపారు. 

కేర‌ళ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కుమ్మ‌న‌మ్ రాజ‌శేఖ‌ర‌న్ నెమామ్ నుంచి, కేజే అల్ఫాన్స్ కంజిరప్ప‌ల్లి నుంచి, సురేష్ గోపి త్రిసూర్ నుంచి, అబ్దుల్ స‌లామ్ తిరూర్ నుంచి, కేర‌ళ మాజీ డీజీపీ జాకోబ్ ఇరింజ‌ల‌కుడ నుంచి పోటీ చేస్తున్నారని ఆయ‌న‌ చెప్పారు. 

ఇక త‌మిళ‌నాడులో ఎన్డీఏ భాగ‌స్వామిగా పోటీచేస్తున్న బీజేపీ 20 స్థానాల్లో బ‌రిలో దిగ‌నుంద‌ని తెలిపారు. త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షుడు ఎల్ మురుగ‌న్ ధార‌పురం నుంచి, సీనియ‌ర్ నాయ‌కుడు హెచ్ రాజా క‌రైకూడి నుంచి పోటీ చేస్తున్నార‌ని చెప్పారు.   

బెంగాల్ బీజేపీ అభ్యర్థుల జాబితాను ఆదివారం బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మూడోదశ జాబితాలో 27 మందికి చోటు దక్కగా, నాలుగో దశ జాబితాలో 38 మందికి చోటు దక్కింది. రవీంద్ర భట్టాచార్య సింగూర్ నుంచి, స్వపన్ దాస్‌గుప్తా తారకేశ్వర్, నిషిత్ ప్రామాణిక్ దిన్హట, కేంద్ర మంత్రి బబూల్ సుప్రియో టోలీగంగ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. 

ఇక లాకెట్ ఛటర్జీ చున్‌చుర నుంచి, అంజనా బసు సోనార్ పూర్ నుంచి, ఇంద్రనీల్ దాస్ కస్బా, తనుశ్రీ చక్రవర్తి హౌరా నుంచి బరిలోకి దిగుతున్నారు.