కాంగ్రెస్ చేతుల్లో అసోం సురక్షితంగా ఉంటుందా?

బద్రుద్దిన్ అజ్మల్ మద్దతు తీసుకున్న రాహుల్ అసోంను అక్రమచొరబాట్ల నుంచి రక్షించగలరా? అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ వారి  చేతుల్లో అసోం సురక్షితంగా ఉంటుందని మీరు విశ్వసిస్తున్నారా? అని ప్రశ్నించారు. మరో ఐదేళ్లు బీజేపీకి అధికారం ఇవ్వాలని, అక్రమచొరబాటుదార్లను నియంత్రిస్తామని ఆయన అస్సాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ భరోసా ఇచ్చారు.
 
 తామెంత మాత్రమూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయమని అమిత్‌షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాత్రం అక్రమచొరబాటు దారులను బుజ్జగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేరళలో ముస్లిం లీగ్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని, బెంగాల్‌లో షరీఫ్‌తో, అసోంలో బద్రుద్దిన్ అజ్మల్‌తో పొత్తు పెట్టుకుందని విమర్శించారు.
 
అసోంను ఎవరు పాలించాలన్నది మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుందని చెప్పారు. ఓ వైపు ప్రధాని మోదీ, సోనోవాలా నాయకత్వం, మరోవైపు గాంధీ, బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వం అని, అసోంను ఎవరు అభివృద్ధి చేస్తారో మీరే చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. 
 
కాగా, అస్సాం గౌరవ, మర్యాదలను ప్రభుత్వం కాపాడుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఆదివారం ఆయన  బిశ్వనాథ్‌లో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ అస్సాం గడ్డ గౌరవాన్ని కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. సంగీత సామ్రాజ్య చక్రవర్తి భూపేన్ హజారికాకు ‘భారత రత్న’ పురస్కారాన్ని ప్రదానం చేయడానికి కారణం అదేనని, అస్సాం పట్ల తమకుగల గౌరవానికి ఇది నిదర్శనమని తెలిపారు.