డీఎంకేలో ఉదయించిన మూడో వారసత్వం!

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన కుమారుడు ఉదయానిధిని తొలిసారిగా ప్రస్తుత్వం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించడంతో డీఎంకే అగ్రనేత దివంగత కరుణానిధి కుటుంబంలో మూడో వారసత్వం ఉదయించిన్నట్లు అయింది.
వాస్తవానికి కరుణానిధి మొదటి నుండి వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ వచ్చేవారు. చాలాకాలం తన కుటుంభం సభ్యులు ఎవ్వరిని రాజకీయాలలో ప్రోత్సహించలేదు. అయితే వృద్ధాప్యం దగ్గర పడినకొద్దీ, కుటుంభం వత్తిడుల కారణంగా పరిష్టితులు మారాయి. మొదటగా బావమరిది మురసోలి మారన్ ను తోడుగా కేంద్ర రాజకీయాలలోకి తీసుకు వచ్చారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు దయానిధి మారన్ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు.
రాష్త్ర రాజకీయాలలో కుమారులు ఎం కె అళగిరి, ఎం కె స్టాలిన్ లను తీసుకు వచ్చారు. వీరిద్దరూ కూడా మొదట్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలకు పరిమితమైన, తర్వాత చట్టసభలకు ఎన్నికయ్యారు. కుమార్తె కంజిమనిని కూడా పార్లమెంట్ కు పంపారు. వీరిద్దరి తల్లులు వేరు కావడంతో వారి మధ్య వారసత్వం కోసం చాలాకాలం ప్రచ్ఛన్న పోరు జరిగింది.
చివరకు అళగిరిని స్టాలిన్ పార్టీ నుండి బహిష్కరించడం, కాంజిమానితో అవగాహనకు రావడం జరిగింది.  తమిళ సినీ రంగంలో తనదైన స్థానం సంపాదించుకున్న ఉదయనిధికి రెండేళ్ల క్రితమే డీఎంకే యువజన విభాగం కార్యదర్శి బాధ్యతలను స్టాలిన్‌ అప్పగించారు.  తన తాత కరుణానిధికి కంచుకోటైన ట్రిప్లికేన్‌ నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. యథాప్రకారం కొళత్తూరు నుంచి మూడోసారి స్టాలిన్‌ పోటీకి దిగుతున్నారు.
కూటమిలోని కొన్నిపార్టీలు డీఎంకే ఉదయసూర్యుని చిహ్నంపై పోటీ చేస్తున్నాయి. దీంతో ప్రత్యక్ష, పరోక్ష అభ్యర్థులను కలుపుకుంటే డీఎంకే 187 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లయింది. మరోవంక, అధికార అన్నాడీఎంకే 178 స్థానాల్లో సొంత పార్టీ అభ్యర్థులను బరిలోకి దించగా రెండాకుల చిహ్నంపై పోటీచేసే అభ్యర్థులను కలుపుకుంటే మొత్తం 191 స్థానాల్లో అన్నాడీఎంకే తలపడుతోంది.
కాగా, డీఎంకే అభ్యర్థుల జాబితాలో ఏడుగురు తెలుగువారికి అవకాశం కల్పించారు.  వీరిలో చెన్నై హార్బర్‌  నియోజకవర్గం పీకే శేఖర్‌బాబు, సైదాపేట నుంచి ఎం.సుబ్రమణ్యం, అన్నానగర్‌ నుంచి ఎంకే మోహన్‌, తిరుచ్చి పశ్చిమం నుంచి కేఎన్‌ నెహ్రూ, తిరువణ్ణామలై నుంచి ఏవీ వేలు, కృష్ణగిరి జిల్లా హోసూరు నుంచి వై.ప్రకాష్‌, విల్లుపురం జిల్లా తిరుక్కోవిలూర్‌ నుంచి కె.పొన్ముడి పోటీ చేస్తున్నారు.