ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరతకే క్వాడ్ 

ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరతకే క్వాడ్ 
క్వాడ్ దేశాల గ్రూప్‌నకు పరిపూర్ణ రూపం వచ్చిందని, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరతకు ముఖ్యమైన ఆధారంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ  తెలిపారు. స్వేచ్ఛాయుత, అరమరికలు లేని, సమ్మిళిత ఇండో-పసిఫిక్‌ కోసం చిత్తశుద్ధి, ప్రజాస్వామిక విలువలు మనల్ని సంఘటిత పరిచాయని చెప్పారు.

ఈ సానుకూల దృక్పథానికి మూలాలు వసుధైక కుటుంబం అనే ప్రాచీన భారతీయ తత్వంలో ఉందని ప్రధాని చెప్పారు. వసుధైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబమని వివరించారు. మనమంతా కలిసి పని చేద్దామని, ఉమ్మడి విలువలను సమగ్రంగా అమలు చేసేందుకు మునుపెన్నడూ లేనంత సన్నిహితంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సురక్షితమైన, సుస్థిరమైన, సౌభాగ్యవంతమైన ఇండో-పసిఫిక్ కోసం సమైక్యంగా కృషి చేద్దామని సూచించారు. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ, క్వాడ్ దేశాలతోనూ, మిత్ర దేశాలతోనూ కలిసి ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సుస్థిరత కోసం కృషి చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో సహకారానికి అత్యంత ముఖ్యమైన వేదికగా క్వాడ్ నిలవబోతోందని పేర్కొన్నారు.

ప్రధానంగా ఆచరణాత్మక పరిష్కారాలు, కచ్చితమైన ఫలితాలపై క్వాడ్ దేశాల గ్రూప్ దృష్టి సారించిందని, అందువల్ల ఇది చాలా ముఖ్యమైనదని తెలిపారు. ప్రపంచానికి ప్రయోజనకరమైన వ్యాక్సిన్ తయారీని బలోపేతం చేయడానికి వీలుగా సరికొత్త ఉమ్మడి భాగస్వామ్యాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. మొత్తం ఇండో-పసిఫిక్‌‌ ప్రాంతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పటిష్టపరిచేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా ఆధిపత్య ధోరణిని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘‘మనకు మన కర్తవ్యాలు తెలుసు. మన ప్రాంతం అంతర్జాతీయ చట్టాలకు, అన్ని సార్వజనీన విలువలకు, నిర్బంధాలు లేని పరిస్థితులకు కట్టుబడి ఉంది, అయితే మన భవిష్యత్తుపట్ల నేను ఆశాభావంతో ఉన్నాను’’ అన్నారు.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ మాట్లాడుతూ, 21వ శతాబ్దంలో ప్రపంచ గతిని రూపుదిద్దేది ఇండో-పసిఫిక్ అని చెప్పారు. గొప్ప ప్రజాస్వామిక దేశాల నేతలుగా మన భాగస్వామ్యం శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకు దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధన కోసం ఈ ప్రాంతంలోని అనేక దేశాలను కలుపుకొనిపోవాలని సూచించారు.

జపాన్ ప్రధాన మంత్రి యొషిహిడె సుగ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ ఆసక్తిని క్వాడ్ పంచుకుంటుందని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, అరమరికలు లేని ఇండో-పసిఫిక్ ప్రాంతం సాకారం కావడం కోసం భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ సంఘటితం కావాలని పిలుపిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారిని అధిగమించడంతో సహా, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాల కోసం గట్టిగా కృషి చేయాలని సూచించారు.