ఈ సారి కేరళలో బిజెపి ప్రభుత్వం తథ్యం 

ఏప్రిల్ 6న జరుగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 35 నుండి 40 వరకు సీట్లు గెలిచుంటుందని చెబుతూ ఈ సారి అక్కడ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేరళ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ భరోసా వ్యక్తం చేశారు. అవుట్ లుక్ ప్రతినిధి ప్రీత నాయర్ ఆయనతో జరిపిన ఇంటర్వ్యూలోని ప్రధాన అంశాలు: 

ప్రశ్న: ఏప్రిల్ 6న కేరళ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి మీ అంచనాలు ఏమిటి?

జవాబు: ఈ ఎన్నికలలో 35 నుండి 40 సీట్లు గెలుపొందగలమని మేము బలంగా విశ్వసిస్తున్నాము. ఈ సారి మేమె ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. అన్ని నియోజకవర్గాలలో ఈ సారి త్రిముఖ పోటీ జరుగనున్నది. అందుచేత మేము 35 నుండి 40 సీట్లు గెల్చుకొంటే కాంగ్రెస్, సిపిఎం, ముస్లిం లీగ్, ఇతర పార్టీల నుండి బిజెపిలోకి ప్రవాహం ప్రారంభం అవుతుంది. ఇప్పటికే సిపిఎం, యూడీఎఫ్ లకు చెందిన పలువురు బీజేపీలో చేరుతున్నారు. మరి అనేకమంది యూడీఎఫ్ నుండి చేరతారంటూ అనుకొంటున్నాము.

ప్రశ్న: కానీ 140 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పుడు బిజెపికి ఒక సీట్ మాత్రమే ఉంది. 40 వరకు సీట్లు పెరుగుతాయని ఏ విధంగా అనుకొంటున్నారు?

జవాబు: త్రిపురలో మేము జీరో నుండి ప్రారంభమై, ఇప్పుడు అధికారంలో ఉన్నాము.

ప్రశ్న: అధికారంలో ఉన్న సిపిఎం నేతృత్వంలోని ఎల్ డి ఎఫ్ మరోసారి గెలువబోతున్నట్లు ముందస్తు సర్వేలు చెబుతున్నాయి. 

జవాబు: ఈ సర్వేలను నేను నమ్మను. 2019 లోక్ సభ ఎన్నికలప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నట్లు ముందస్తు సర్వేలు ఊహాగానాలు చేశాయి. కానీ కాంగ్రెస్ కు 40 సీట్లు మాత్రమే వచ్చాయి.

ప్రశ్న: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సహితం బీజేపీ చెప్పుకోదగిన విజయాలు సాధింపలేదు. 

జవాబు: అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు భిన్నమైనవి. స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానిక అంశాలే ప్రభావం చూపుతూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో పునరాయి విజయన్ పోటీ చేశారా?

ప్రశ్న: ఈ మధ్య గోల్డ్ స్మగ్లింగ్ కేసు విషయమై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి పునరాయి విజయన్ పై విమర్శలు గుప్పించారు. బిజెపి ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగిస్తున్నట్లు విజయన్ చెబుతున్నారు. ఒక సంవత్సరం పాటు దర్యాప్తు చేసిన తర్వాత ఎన్ఐఎ సహితం ఎవ్వరిని దోషిగా చేర్చలేదు?

జవాబు: గోల్డ్ స్మగ్లింగ్ కేసు ముఖ్యమైనది. ప్రభుత్వం కస్టమ్స్, ఈడి వంటి ఏజెన్సీల ప్రాధాన్యతను గుర్తించాలి. కేంద్ర హోమ్ మంత్రి ఈ కేసు విషయమై 9 ప్రశ్నలను కేరళ సీఎంకు సంధించారు. వీటికి జవాబు ఇవ్వ వలసింది పోయి ఆయన ఎదురు ప్రశ్నలు వేశారు.

ప్రశ్న: ఇ శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో బీజేపీలో  గందరగోళం ఏమైనా ఉందా? మీరు ప్రకటించిన మరుసటి రోజే మాట మార్చారు. 

జవాబు: శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే విషయంలో ఎటువంటి గందరగోళం లేదు. మీడియానే ఈ గందరగోళాన్ని సృష్టించింది. ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్హ్డిని ప్రకటించడం బిజెపికి అలవాటు లేదు. పైగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి అటువంటి ప్రకటన చేసే అధికారం లేదు. ఇదివరలో ఆ విధంగా ఎక్కడా జరగలేదు. అయితే నేను చెప్పినదానిలో మార్పు లేదు. ఆ పదవికి శ్రీధరన్  బాగా అర్హత గలవారు. ఆయన అభ్యర్థిత్వం విషయంలో రాష్ట్ర పార్టీలో ఎటువంటి గందరగోళం లేదు. చివరకు హోమ్ మంత్రి అమిత్ షా అసహితం తన ప్రసంగంలో అటువంటి సంకేతం ఇచ్చారు.

ప్రశ్న: పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి పదవికి మీరు సహజమైన వ్యక్తి కారా?

జవాబు: నేను ముఖ్యమంత్రి కావలి అనుకోవడం లేదు. రాష్ట్రంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే విధంగా రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే నా లక్ష్యం.

ప్రశ్న: ముస్లిం లీగ్ ను బీజేపీలో చేరమని సీనియర్ నేత శోభా సురేంద్రన్ ఆహ్వానించారు. అయితే పార్టీ సీనియర్ నేతలు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ విషయమై గందరగోళం ఏమిటి?

జవాబు: తమ మతతత్వ ఆలోచనలను విడిచి పెడితో బిజెపితో చేరమని శోభా సురేంద్రన్ ముస్లిం లీగ్ ను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు, వార్తలలో ఆ విషయాన్నీ ప్రసావించలేదు. ఈ విషయమై పార్టీలో అంతర్గతంగా ఎటువంటి వివాదం లేదు.

ప్రశ్న: బిజెపి ఎందుకని క్రైస్తవులను ఆకర్షించే ప్రయత్నంచేస్తున్నది ?

జవాబు: క్రైస్తవులలో బిజెపి అనుకూల ధోరణి కనిపిస్తున్నది. ఇస్లామిక్ మతోన్మాదుల నుండి అంతర్జాతీయ ఉగ్రవాద ప్రమాదాన్ని వారు కూడా గుర్తించారు. అంతర్జాతీయ ఇస్లామిక్ మతోన్మాదులు క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని వారి చర్చి లను, ప్రార్ధన స్థలాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ విషయమై వారు తమ ఆందోళనలను మాతో పంచుకొంటున్నారు. అటువంటి ఉగ్రవాద ముఠాలే కేరళలో ఎల్ డి ఎఫ్, యూడీఎఫ్ లతో పనిచేస్తున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాదం నుండి తమను బిజెపి మాత్రమే కాపాడగలదని క్రైస్తవులు భావిస్తున్నారు. మా ర్యాలీలతో చాలామంది క్రైస్తవ నాయకులు, క్రైస్తవ బృందాల నుండి పెద్ద ఎత్తున మద్దతు పొందుతున్నాము.

(అవుట్ లుక్ నుండి)