సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన ముగ్గురి అరెస్టు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సోమవారంనాడు తెలిపింది. వీరిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి పలు రకాలు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌సీబీ అధికారులు పేర్కొన్నారు.
ఎన్‌సీబీకి చెందిన ముంబై, గోవా బృందాలు వేర్వేరుగా దాడులు నిర్వహించి ముంబైలో ఇద్దరు విదేశీయులను అరెస్టు చేయగా, రాజ్‌పుత్ కేసుతో  సంబంధం ఉన్న హేమంత్ షా అలియాస్ మహార అనే వ్యక్తిని గోవాలో అరెస్టు చేశారు.
రాజ్‌పూత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తు సాగిస్తున్న ఎన్‌సీబీ గత ఏడాది ఈ కేసులో అరెస్టు చేసిన అనుజ్ కేశ్వాని, రీగల్ మహక్కల్‌కు హేమంత్ షా మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్టు ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు. గోవాలోని పలు ప్రాంతాల్లో ఎన్‌సీబీ దాడులు కొనసాగుతున్నాయని, పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, వాటి సరఫరాదారులను అదుపులో తీసుకున్నట్టు ఎన్‌సీబీ అధికారి ఒకరు తెలిపారు.
ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై ముంబై పోలీసులు దర్యాప్తు జరిపి ఆత్మహత్యగా నిర్ధారించారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఎన్‌సీబీ సైతం దర్యాప్తులో వచ్చి చేరింది. డ్రగ్స్ కోణం నుంచి కేసును దర్యాప్తు చేస్తోంది.