50 శాతంకు రేజర్వేషన్ల పరిమితిపై `సుప్రీం’ సమీక్ష

రిజర్వేషన్లపై 30 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండాలా.. వద్దా.. అనేది స్పష్టం చేయాలని అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

మరాఠా కోటా చట్టంతో మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయనే పిటీషన్‌ను జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు తీసుకుంది. 50 శాతం లోపు రిజర్వేషన్ల అంశాన్ని తమ రాష్ట్రానికే పరిమితం చేయకూడదనే మహారాష్ట్ర విజ్ఞప్తిని ధర్మాసనం ఆమోదించింది.

కేసు పరిధిని మిగిలిన రాష్ట్రాలకు విస్తృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. 50 శాతం లోపు రిజ్వరేషన్లపై తమ వాదనలు వినిపించడానికి రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని తెలిపింది. అలాగే 2018 రాజ్యాంగ చట్టం (102వ సవరణ)పై స్పందించాలని రాష్ట్రాలను ధర్మాసనం కోరింది. 

ఈ సవరణతో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు పార్లమెంట్‌ రాజ్యంగ గుర్తింపు ఇచ్చింది. సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఆర్టికల్‌ 342ఎ ద్వారా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లపై చట్టాలను రూపొందించే హక్కును రాష్ట్రాలకు తొలగించారు. ‘

రాజ్యాంగంలో పొందుపర్చిన సమాఖ్య నిర్మాణానికి విరుద్ధంగా ఆర్టికల్‌ 342 ఎను రూపొందించారా అని భావిస్తున్నారా.. అనే విషయంపై సమాధానం ఇవ్వాలని’ రాష్ట్రాలను ధర్మాసనం కోరింది. విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ నెల 15 నుంచి ప్రతి రోజూ ఈ విచారణను కొనసాగించనుంది. 25 తేదీలోగా వాదనలు ముగించాలని ధర్మాసనం భావిస్తుంది.

మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు ఇస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా కోటా చట్టాన్ని ఆమోదించింది. అయితే 2019 జూన్‌లో మరాఠాలకు విద్యలో 12 శాతాన్ని, ఉద్యోగాల్లో 13 శాతాన్ని తగ్గిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటవచ్చని కూడా పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలయింది. 

మహారాష్ట్ర తరుపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి తన వాదనలు వినిపించారు. ఆర్టికల్‌ 342ఎతో బలహీన వర్గాలకు చట్టాలను రూపొందించే హక్కును రాష్ట్రాల నుంచి తీసివేశారని ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్రాల వాదనను కూడా వినాల్సిన అవసరం ఉందని ఆటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ కూడా అంగీకరించారు.

కాగా, 1992లో తొమ్మిది మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ‘అసాధారణ పరిస్థితుల్లో తప్ప విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు’ అని తీర్పు ఇచ్చింది. అయితే సంవత్సరాలు గడిచే కొద్ది తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటే విధంగా చట్టాలను ఆమోదించాయి.