
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు బీజేపీలో చేరడం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ లో పలువురు సినీ ప్రముఖులు ఆ పార్టీలో చేరగా, కేరళలో తాజాగా ప్రముఖ మలయాళీ నటుడు దేవన్ చేరారు.
తిరువనంతపురంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కేరళ విజయ యాత్రలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. శంఖుముఖం బీచ్‌లో నిర్వహించిన బహిరంగసభలో దేవన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. త్రిస్సూర్‌లో జన్మించని దేవన్ పూర్తిపేరు దేవన్ శ్రీనివాసన్. బుల్లితెర నటుడిగా ఆరంగేట్రం చేసిన దేవన్.. పలు సినిమాల్లో నటించడమే కాకుండా నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు. మళయాలంతో పాటు కన్నడ, తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.
కాలేజీ రోజుల్లో కాంగ్రెస్ అభిమానిగా ఉన్న దేవన్.. అనంతర కాలంలో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో దేవన్ బీజేపీలో చేరడం తమకు లాభిస్తుందని పలువురు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కేరళ బీజేపీలో ఇటీవల చేరిన మెట్రో శ్రీధరన్ మాట్లాడుతూ.. బీజేపీ ఒక్కటే కేరళను కాపాడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. తాను ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశానని, ఇప్పుడు కేరళ అభివృద్ధిని కాంక్షించి బీజేపీలో చేరానని శ్రీధరన్ స్పష్టంచేశారు.
కేరళలో అవినీతిలో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ పోటీ పడుతున్నాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా ఎద్దేవా చేశారు. కేరళ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కేరళ విజయ యాత్ర ముగింపు సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. యూడీఎఫ్ వచ్చినప్పుడు సోలార్ కుంభకోణం, ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్ స్కామ్‌కు పాల్పడ్డాయని ధ్వజమెత్తారు. డాలర్, గోల్డ్ స్మగ్లింగ్ కేసులతో అధికార ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.
సామాజిక విప్లవాలకు పురిటిగడ్డ అయిన కేరళ ఈరోజు అవినీతి, రాజకీయ హింస, దుష్టపాలనకు ఆలవాగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో మార్పు తీసుకు వచ్చేందుకు బీజేపీకి 1,940 కిలోమీటర్ల మేరకు యాత్ర నిర్వహించి, 62 చోట్ల భారీ ర్యాలీలు, గ్రామాల్లో లెక్కకు మిక్కిలిగా ర్యాలీలు నిర్వహించామని తెలిపారు.
ఇక నుంచి ఆత్మనిర్భర్ కేరళ మిషన్ వైపు తామంతా పని చేస్తామని అమిత్ షా ప్రకటించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించి, పర్యాటకరంగాన్ని ఒక పరిశ్రమగా మార్చిన ఘనత కేరళకే చెందుతున్నారు. అయితే, ఇవాళ రాష్ట్రాన్ని రాజకీయ హింస, అవినీతికి ఆలవాలంగా యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ మార్చాయని తప్పుపట్టారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి