కరోనాపై పోరాటాన్ని భారత్ ముందుండి నడిపిస్తోంది

కరోనాపై పోరాటాన్ని భారత్ ముందుండి నడిపిస్తోంది

సంప్రదాయ మూలాల్లోకి వెళ్లడం, పరిశోధనలు, పున:ఆవిష్కరణల కారణంగానే ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాపై పోరాటాన్ని భారతదేశం ముందుండి నడిపిస్తోందని  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

 భారతీయ శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనల కారణంగానే కరోనా సవాలును ఎదిరించి సమస్యకు సాంకేతిక పరిష్కారం కనుగొన్నామని చెప్పారు ఆదివారం విజ్ఞాన్ భవన్‌లో  ఈఎస్ఐసీ వైద్య కళాశాల (ఫరీదాబాద్) తొలి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలతోపాటు విధాన నిర్ణేతలు సరైన సమయంలో తీసుకున్న సరైన  నిర్ణయాల కారణంగానే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మనం విజయం సాధించామని కొనియాడారు.

పీపీఈ కిట్లు, సర్జికల్ గ్లవ్స్, మాస్కులు, వెంటిలేటర్లు, చివరకు టీకాను కూడా తక్కువ సమయంలో ఉత్పత్తిచేసిన భారతీయ పరిశ్రమను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. వైద్యవృత్తి అత్యంత పవిత్రమైన వృత్తి అన్న ఉపరాష్ట్రపతి, వృత్తి నిర్వహణలో చిత్తశుద్ధితోపాటు నైతికతను, విలువలను పాటించాలని యువ వైద్యులకు సూచించారు. 

విలువలను పాటించే విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదన్న ఆయన, కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో వైద్యవృత్తి మరిన్ని సవాళ్లతో కూడుకున్నదని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనాపై పోరాటంలో ముందు వరస పోరాటయోధులుగా పాటుపడాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 

కరోనా టీకాకరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా ముందుకు సాగుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ కరోనా కారణంగానెలకొన్న పరిస్థితులు మెల్లిమెల్లిగా సర్దుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కరోనా పూర్తిగా నిర్మూలించబడేంతవరకు ఎట్టిపరిస్థితుల్లోనూ అలసత్వాన్ని వహించవద్దని దేశప్రజలకు ఉపరాష్ట్రపతి సూచించారు.

ప్రస్తుత కరోనా మహమ్మారి పట్టణాలతో పోల్చి చూస్తే, గ్రామాల్లో తన ప్రభావాన్ని చూపించలేకపోయిందని, దీనికి కారణం గ్రామీణ వాతావరణమే అని తెలిపారు.  దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల కేసులపై ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో 65శాతం మరణాలకు అసంక్రమిత వ్యాధులే కారణమన్న ఈ ఏడాది ఆర్థిక సర్వేను సైతం ఆయన ప్రస్తావించారు.