కొత్త సాగు చట్టాలతో రైతులకు లబ్ధి

కొత్త సాగు చట్టాలతో రైతులకు లబ్ధి

కేంద్రం అమలు చేసే కొత్త సాగు చట్టాలతో రైతులు లబ్ధి పొందుతారని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రైతు నేతలకు భరోసా ఇచ్చారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతుల ప్రతినిధి బృందంతో యోగి ఆదిత్యనాథ్ శనివారంనాడు తన అధికార నివాసంలో సమావేశమమై రైతుల ఆదాయం పెరగడానికి సాగు చట్టాలు దోహదం చేస్తాయని చెప్పుకొచ్చారు. 

రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతోనే కొత్త సాగు చట్టాలను కేంద్రం తీసుకువచ్చినట్టు యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పలు పథకాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

 ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకం చక్కటి ఫలితాలు ఇవ్వడంతో పాటు దేశంలోనే అత్యున్నత ప్రతిభ కనబరిచినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమ బహుమతి కూడా వచ్చిందని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని పేర్కొన్నారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాగు చట్టాలు రైతులకు మేలుచేసే విధంగా ఉన్నాయని, రైతుల సాధికారతకు ఈ చట్టాలు పయోగపడతాయని రైతు ప్రతినిధి బృందం అభిప్రాయం వ్యక్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తాము సాగు చట్టాలకు మద్దతిస్తున్నట్టు ప్రభుత్వానికి రైతు ప్రతినిధులు తెలిపినట్టు పేర్కొంది