ప్రధాని నేతృత్వంలో 75వ స్వాతంత్ర వార్షికోత్సవ సమితి 

75వ భారత స్వతంత్ర వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకోవడం కోసం జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మందితో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మార్చ్ 8న మొదటి సమావేశం జరిపే ఈ కమిటీలో అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. 

ఈ ఉత్సవాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సముచితంగా జరపడం కోసం ఈ కమిటీ విధానపరమైన మార్గదర్శనం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొన్నది. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం 91వ వార్షికోత్సవం మార్చ్ 12 నుండి ఈ ఉత్సవాలను ప్రారంభించే యోజన చేస్తున్నారు. 

ఈ కమిటీలో మాజీ రాష్ట్రపతి ప్రతిభ పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవగౌడలతో పాటు కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల గవర్నలు, ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు. లత మంగేష్కర్, సచిన్ టెండూల్కర్, అమర్త్యసేన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. 

వాజపేయి హయాంలో `భారత రత్న’ పురస్కారం అందుకున్న అమర్త్యసేన్ అమెరికాలో ఉంటున్నప్పటికీ, ప్రధాని మోదీ పట్ల నిత్యం విమర్శలు కురిపిస్తున్నప్పటికీ ఈ కమిటీలో సభ్యునిగా నియామకం పోవడం ప్రాధాన్యత సంతరింప చేసుకోంది. 

రాజకీయ ప్రముఖులలో శరద్ పవర్, ములాయం సింగ్ యాదవ్, సోనియా గాంధీ, ఎల్ కె అద్వానీ, సీతారాం ఏచూరి, మమతా బనెర్జీ, మాయావతి  వంటి పలువురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరు గవర్నర్లు, ముఖ్యమంత్రులతో పాటు చంద్రబాబు నాయుడు, రామోజీరావు వంటి ప్రముఖులు ఉన్నారు. 

అంతకు ముందు హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉత్సవాల కార్యక్రమ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

 .