తృణ‌మూల్ ఖేల్ ఖతం …  బెంగాల్ అభివృద్ధి షురూ!

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో ఇక, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖ‌త‌మైంద‌ని, బెంగాల్ అభివృద్ధి షురువైత‌ద‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.  ప్ర‌జ‌లు ఎలాంటి భ‌యం లేకుండా బీజేపీకి ఓటేయాల‌ని, అస‌మ‌ర్థ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు.  

బెంగాల్ ప్రజల `బంగారు బెంగాల్’ కల వేరవేరుతుందని  అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ ప‌శ్చిమ‌బెంగాల్‌కు వెళ్లిన ప్ర‌ధాని  కోల్‌క‌తాలోని బ్రిగేడ్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన‌ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ చెప్పారు.  ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌జ‌లు శాంతిని, ప్ర‌గ‌తిని కోరుకుంటున్నార‌ని, రాష్ట్రం బంగారు బెంగాల్‌గా మారాల‌ని ఆశిస్తున్నార‌ని చెప్పారు.

మ‌మ‌త హ‌యాంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని, బెంగాలీ ప్ర‌జ‌ల‌ను దోచుకున్నార‌ని ప్ర‌ధాని ఆరోపించారు. మ‌మ‌త స‌ర్కారు లెక్క‌లేన‌న్ని కుంభకోణాలు చేసింద‌ని, ఆ కుంభ‌కోణాల‌న్నింటితో క‌లిపి అవినీతి ఒలింపిక్స్ నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని ప్ర‌ధాని ఎద్దేవా చేశారు. 

మ‌మ‌త స‌ర్కారును బెంగాల్‌ను అభివృద్ధి చేయ‌డానికి బ‌దులు విభజించింద‌ని ధ్వజమెత్తారు. అందుకే ఇక్క‌డ క‌మ‌లం విక‌సిస్తున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. మార్పు కోసం బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీపై ఉంచిన విశ్వాసాన్ని ఆమె వమ్ము చేశారని  ప్రధాని మండిపడ్డారు. 

 `బెంగాల్ ప్ర‌జ‌లు నిన్ను దీదీగా ఎన్నుకుంటే నువ్వు మాత్రం నీ మేన‌ల్లుడికి అత్త‌గా మాత్ర‌మే ఎందుకు మిగిలిపోయావ్’ అని మ‌మ‌తా బెన‌ర్జిని ఉద్దేశించి ప్ర‌ధాని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న తాను అడుగ‌డం లేద‌ని, బెంగాల్ ప్ర‌జ‌లు అడుగుతున్నార‌ని చెప్పారు.     

ఈ అసెంబ్లీ ఎన్నిక‌లవేళ తృణ‌మూల్ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, ఆయా పార్టీల‌ బెంగాల్ వ్య‌తిరేక వైఖ‌రి ఒక‌వైపు ఉండ‌గా.. బెంగాల్ ప్రజ‌లంతా ఒక‌వైపు ఉన్నార‌ని ఆయ‌న‌ తెలిపారు. ఇక, బెంగాల్ ఇక‌పై అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని, రాష్ట్రానికి పెట్టుబ‌డులు పెరుగుతాయ‌ని, బెంగాల్ సంస్కృతికి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని, రాష్ట్రంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయ‌ని ప్రధాని భరోసా ఇచ్చారు.

ఈ విష‌యంలో ప్రజలకు  క‌చ్చిత‌మైన హామీ ఇవ్వ‌డానికి తాను ఇక్క‌డికి వ‌చ్చాన‌ని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. రానున్న 25 ఏండ్లు బెంగాల్ అభివృద్ధికి ఎంతో కీల‌క‌ మని చెబుతూ  వ‌చ్చే ఐదేండ్లలో జ‌రిగే అభివృద్ధే 25 ఏండ్ల అభివృద్ధికి పునాదిలాంటిద‌ని చెప్పారు.

‘బెంగాల్‌లో స‌మూల మార్పులు తీసుకొస్తామ‌ని చెప్ప‌డానికే నేను ఇక్క‌డి వ‌చ్చా. బెంగాల్ అభివృద్ధి చెందుతుంది. ఇక్క‌డి ప‌రిస్థితి పూర్తిగా మారిపోతుంది. పెట్టుబ‌డులు పెరుగుతాయి. కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాట‌వుతాయి. రాష్ట్రం మొత్తం పున‌ర్నిత‌మ‌వుతుంది. ఈ విష‌యంలో మాపై న‌మ్మ‌కం ఉంచండి’ అని ప్ర‌ధాని హామీ ఇచ్చారు.

రైతులు, వ్యాపారుల సంక్షేమం కోసం, బెంగాలీ చెల్లెండ్లు, బిడ్డ‌ల అభివృద్ధి కోసం తాము క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తామ‌ని చెప్పారు. బెంగాల్ ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను నెర‌వేర్చే ప్ర‌తి అడుగులో తాము ఉంటామ‌ని స్పష్టం చేశారు.

25 ఏండ్ల‌లో బెంగాల్ పూర్తిగా అభివృద్ధి చెందుతుంద‌ని, 2047లో దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 100 ఏండ్లు పూర్త‌వుతాయ‌ని అప్ప‌ట్నుంచి మ‌రోసారి బెంగాల్ రాష్ట్రం దేశాన్ని ముందుకు న‌డిపిస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగాల్‌లో ప్ర‌జాస్వామ్య వ్య‌వస్థ పూర్తిగా దెబ్బ‌తిన్న‌ద‌ని, బీజేపీ అధికారంలోకి ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని చెప్పారు.