ఉగ్రవాదులకు పెన్షన్ ఇస్తున్న పాక్ 

ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వ నిధులతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషించే చర్యలను నిలిపివేయాలని, ఆ దేశంలోని అల్పసంఖ్యాక వర్గాల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనలకు స్వస్తి చెప్పాలని భారత్ డిమాండు చేసింది. కరడుగట్టిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ తన సొంత నిధులతో పెన్షన్లు ఇస్తోందన్న విషయం ప్రపంచదేశాలన్నిటికీ తెలుసునని ఎద్దేవా చేసింది. 

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ 46వ సమావేశంలో పాకిస్తాన్ చేసిన ప్రకటనకు భారత్  గట్టిగా సమాధానమిస్తూ భారత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ ఈ వేదికలను ఉపయోగించుకుంటోందని జెనీవాలోని భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి పవన్‌కుమార్ బధే తీవ్ర  ఆక్షేపణ వ్యక్తం చేశారు. 

ఐక్యరాజ్యసమితి గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాదులలో అత్యధికులు పాకిస్తాన్ పెంచిపోషిస్తున్నవారేనని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీగా పాకిస్తాన్ మారిందని పాకిస్తానీ నాయకులే గతంలో అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. 

మానవ హక్కుల ఉల్లంఘనకు నీచ రూపమే ఉగ్రవాదమన్న విషయాన్ని పాకిస్తాన్ విస్మరించిందని, ఉగ్రవాదాన్ని బలపరిచే వారు మానవ హక్కుల ఉల్లంఘనదారులేనని ఆయన అభివర్ణించారు. స్వాతంత్య్రానంతరం పాకిస్తాన్‌లో క్రైస్తవులు, హిందువులు, సిక్కులు వంటి మైనారిటీ ప్రజల జనాభా ఎందుకు గణనీయంగా తగ్గుతోందని బధే ప్రశ్నించారు. 

అహ్మదియ్యులు, షియాలు, పష్తున్లు, సింధీలు, బలోచ్ వంటి ఇతర తెగల వారిపై కఠినమైన చట్టాలను ఎందుకు ప్రయోగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.