అనురాగ్ కశ్యప్,తాప్సీ ఇళ్లల్లో ఐటీ దాడులు

బాలీవుడ్ లో ఆదాయపన్ను  దాడులు కలకలం రేపుతున్నాయి. సినీ డైరెక్టర్, నిర్మాత అనురాగ్ కశ్యప్, నటి తాప్సీ పన్ను ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఇవాళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబై, పూణెలోని దాదాపు 22 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. అక్రమంగా సంపాదిస్తున్నారని, ఫిలీం సంస్థకు సంబంధించి పన్ను ఎగవేస్తున్నారనే ఆరోపణలతో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 

వీటితో పాటు నిర్మాత వికాస్ బహల్, మధు మంతేనా ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. వీరు ముగ్గురు కలిసి ఫాంటమ్ ఫిలీంస్  అనే సంస్థను స్థాపించి పలు సినిమాలను తీశారు. ఇంకా శిభాషిష్ సర్కార్ (సీఈఓ రిలయన్స్ ఎంటర్‌‌టైన్‌మెంట్), అఫ్సర్ జైదీ (సీఈఓ ఎక్సైడ్), విజయ్సుబ్రమణ్యం (సీఈఓ క్వాన్)ఆస్తులపై కూడా శోధనలు కొనసాగుతున్నాయి. 

 అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోట్వానే, మధు మంతేనా  వికాస్ బహల్  సంయుక్తగా ఫాంటమ్ ఫిలింస్‌  నిర్మాణసంస్థను స్థాపించారు.  హిందీ, తెలుగు, బంగ్లాతో సహా పలు భాషల్లో అనేక బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించారు.  అయితే వికాస్ బహ్ల్‌పైకంపెనీ ఉద్యోగి లైంగిక వేధింపుల ఫిర్యాదుల తర్వాత 2018 లో  దీన్ని రద్దు చేస్తున్నట్టు  ప్రకటించారు.  

ఈ తరువాత  అనురాగ్ కశ్యప్ తన కొత్త నిర్మాణ సంస్థ గుడ్ బాడ్ ఫిల్మ్స్‌   అనే సంస్థను స్థాపించగా, విక్రమాదిత్య , మధు మంతేనా కూడా తమ సొంత ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు.