భారత్‌ విద్యుత్‌ గ్రిడ్‌లహ్యాకింగ్‌ కు చైనా గురి!  

గతేడాది తూర్పు లఢక్‌లో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో డ్రాగన్‌ దేశం భారత విద్యుత్తు రంగాన్ని లక్ష్యంగా చేసుకొని కుతంత్రాలకు పాల్పడినట్టు తాజాగా తెలిసింది. ఈ హాకర్ల బలప్రదర్శనతో వారు ఎప్పుడై నా ఎక్కడైనా ఇక్కడి పవర్ సిస్టమ్స్, పోర్టుల నిర్వహణ ప్రక్రియలను విచ్ఛిన్నం చేసే ముప్పు ఉంది. 

భారత ప్రభుత్వానికి చెందిన కీలకమైన విద్యుత్తు సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు, లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రాలను చైనా ప్రభుత్వంతో సంబంధమున్న ‘రెడ్‌ఎకో’ అనే హ్యాకింగ్‌ గ్రూప్‌ లక్ష్యంగా చేసుకున్నదని అమెరికాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ ఓ అధ్యయనంలో వెల్లడించింది. భారతీయ సంబంధిత అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. 

ఇది భారతదేశపు ఆంతరంగిక వ్యూహాత్మక భద్రతా కోణంలోకి జరిగిన అతిక్రమణపర్వమే అని ఫ్యుచర్ సంస్థ తెలిపింది. భారత్‌లో సైబర్ దాడికి పాల్పడ్డ కంపెనీలలో ఒకటి చైనా భద్రతా మంత్రిత్వశాఖకు అత్యంత సన్నిహితంగా ఉన్న ట్లు వెల్లడైంది. 

ఈ మంత్రిత్వశాఖ తరఫున చైనా ప్రైవేటు కాంట్రాక్టర్లు, ప్రధాన సంస్థల వ్యవహారాలపై నిఘా పెడు తూ వస్తోందని, ఈ వేగు చర్యలతో అందిన సమాచారా న్ని చైనాకు అధికారికంగా నివేదిస్తోందని తెలిపారు. నిజా నికి టోంటో టీమ్ నిర్వాహకులకు చైనా సైనిక దళంఅయిన పీపుల్స్ లిబరేషన్‌ఆర్మీతో సంబంధాలు ఉన్నా యి.

భారత్‌లో 10 విద్యుత్ ఉత్పాదన సంస్థలు, పంపిణీ కంపెనీలు, వీటితో పాటు రెండు పోర్టుల కీలక సమాచారం వెల్లడవుతోందని అమెరికా సంస్థ తెలిపింది. తమిళనాడుకు చెందిన రెండు అత్యంత కీలకమైన తూతుకుడిలోని తూతుకూడి ప్రాంతపు విఒ చిదంబరనర్ పోర్టుల సైట్లపై సైబర్ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు.

విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై సైబర్ దాడితో ప్రాంతీయ లోడ్ పంపిణీ కేంద్రాలు (ఎల్‌డిసి)లు ప్రత్యేకించి దక్షిణాది, తూర్పు, పశ్చిమ ప్రాంతాలు, అదే విధంగా తెలంగాణ, ఢిల్లీలోని ఎల్‌సిడిలను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. 

గతేడాది అక్టోబరు 12న ముంబైలో పవర్‌కట్‌ వెనుక చైనా హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. ‘ఆటోమేటెడ్‌ నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌’ను విశ్లేషించే నిపుణులతో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్టు తెలిపింది.  అయితే ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ అధ్యయనంపై చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మండిపడ్డారు.  భారత పవర్‌ గ్రిడ్‌లను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారన్న ఆరోపణల్లో వాస్తవంలేదని తోసిపుచ్చారు. 

కాగా, మహారాష్ట్రలో గత ఏడాది తలెత్తిన విద్యుత్ వైఫల్యానికి సైబర్ దాడి, విద్రోహ చర్యలే కారణం అని రాష్ట్ర ఇంధన వ్యవహారాల మంత్రి నితిన్ రౌత్ తెలిపారు.  సైబర్ దాడి జరిగిందనేది వాస్తవమే అన్పిస్తోందని, ఇది ఓ భారీ స్థాయి కుట్రలో భాగం అని తాము నిర్థారించుకుంటున్నామని వెల్లడించారు. 

విద్యుత్ ఆటంకంపై మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎంఇఆర్‌సి), సెంట్రల్ ఎలక్ట్రిసిటి అథార్టీలు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశాయి. కారణాలపై ఆరాతీసి తమకు నివేదికలు అందించాయని మంత్రి వివరించారు. ముంబైలో ఇత ర చోట్లా తీవ్రస్థాయి విద్యుత్ లోపానికి సైబర్ అతిక్రమణలే కారణమని కమిటీలు కూడా నిర్థారించాయని స్పష్టం చేశారు.

మరోవైపు, భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్లపై ఇటీవల చైనా సైబర్‌ దాడికి యత్నించినట్టు సైఫిర్మా అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. టీకా సమాచారాన్ని దొంగిలించేందుకే ఈ చర్యకు పాల్పడినట్టు పేర్కొన్నది. అయితే దీనిపై స్పందించేందుకు రెండు ఫార్మా సంస్థలు నిరాకరించాయి.

గతేడాది అక్టోబరు 12న  ముంబైలోని చాలా ప్రాంతాల్లో అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దవాఖానల్లో  రోగులకు జనరేటర్ల సాయంతో చికిత్సను అందించారు. శివారు ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటల పాటు విద్యుత్తు నిలిచిపోయింది.