మోడల్ ఆత్మహత్యతో మహారాష్ట్ర మంత్రి రాజీనామా 

టిక్ టాక్ స్టార్, టీవీ నటి, మోడల్ పూజ చవాన్ (22) ఆత్మహత్య వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. మరింత ఆలస్యం చేస్తే పరిస్థితి చేయిజారిపోతుందేమోనన్న ఆందోళనతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. శివసేన మంత్రి సంజయ్ రాథోడ్ తో రాజీనామా చేయించారు.
 
గత ఫిబ్రవరి నెల 8వ తేదీన మోడల్ పూజ చవాన్ పూణె నగరంలోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మోడల్ పూజ మృతికి సంబంధించి సంజయ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెతో మంత్రి తీసుకున్న ఫొటోలు, ఆడియో, వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో బయటకు రాగా, ఆయన రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి.
 
ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సంజయ్ రాథోడ్ తన భార్యతో కలసి ఆదివారంముఖ్యమంత్రి  ఉద్దవ్ థాకరతేతో సమావేశమయ్యారు. మోడల్ తో వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధాలు లేవని, తన భార్యకు కూడా తెలుసంటూ ఆమె సమక్షంలోనే అన్ని విషయాలు సీఎంతో చర్చించారు.
 
మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తోపాటు.. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు  చేస్తుండడంతో శివసేన ప్రభుత్వానికిచెడ్డపేరు వస్తోందని చెప్పడంతో రాజీనామా చేయక తప్పలేదు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి రాథోడ్ ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
బంజారా సామాజిక వర్గానికి చెందిన ఓ యువతి చనిపోవడం దురదృష్టకరమని, ఈ ఘటనతో రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నించడం దారుణమని ఆరోపించారు. నిజానిజాలు తొందర్లోనే అన్నీ బయటకు వస్తాయని,  కేసు విచారణకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు.  తాను మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.
 
కాగా, రాథోడ్ కేవలం మంత్రి పదవికి రాజీనామా చేస్తే సరిపోదని, ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ప్రతిపక్ష నేత మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.