నీటిని పొదుపుగా వాడుకోవాలి 

 నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. మన్ కీ బాత్ లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆదివారం ఆయన రేడియోలో మాట్లాడుతూ జీవకోటి మనుగడకు నీరు చాలా అవసరమని, నీటి ప్రాధాన్యతను గుర్తించి, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. 
 
ఆదివారం సైన్స్ డే అనే విష‌యాన్ని ఆయన గుర్తు చేస్తూ  సర్ సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టార‌ని, అందుకుగాను ఆయ‌న‌కు నోబెల్ బహుమతి వచ్చిందని పేర్కొన్నారు. భారత శాస్త్రవేత్తల గురించి, భారత సైన్స్ గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. 
 
యుపి రాజధాని లక్నోలో రైతులు సేంద్రీయ వ్యవసాయం చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సేంద్రీయ వ్యవసాయానికి దేశ వ్యాప్తంగా మద్దతు పెరుగుతుందని ఆయన చెప్పారు. 
 
తమిళ భాష ఎంతో మధురంగా ఉంటుందని, ఆ భాష నేర్చుకోనందుకు తాను బాధ పడుతున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇన్నేళ్లు సీఎంగా, ప్రధానిగా పనిచేసిన సమయంలో ఏదైనా చేయాలేకపోయానని ఫీలవుతున్నారా? అని అపర్ణా రెడ్డి అనే శ్రోత అడిగిందని ప్రధాని మోదీ చెప్పారు. 
 
‘ఈ ప్రశ్న గురించి చాలా ఆలోచించా. తమిళ భాష గొప్పతనం, తమిళ సాహిత్య విశిష్టత గురించి నాకు ఎంతోమంది చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన తమిళ భాషను నేర్చుకోనందుకు చాలా బాధగా ఉంది.’ అని మోదీ అన్నారు.
మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ అనే ఈ మూడు నినాదాలు చైనాకు నచ్చవని ఆయన మండిపడ్డారు. ఈ మూడు నినాదాలతో భారతీయులు చైనా వస్తువుల వాడకాన్ని బాగా త‌గ్గించడం సంతోషించతగ్గ విషయమని ఆయన తెలిపారు. భారతీయ ఉత్పత్తులనే వాడాలని ఆయన ప్రజలకు సూచించారు.