పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వమే 

పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వమే 
రాబోయే ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ కూటమి పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భరోసా వ్యక్తం చేశారు. రాజవంశం కారణంగా కాంగ్రెస్‌ పార్టీ పుదుచ్చేరిలోనే కాకుండా దేశవ్యాప్తంగా విచ్ఛిన్నమవుతోందని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతం కరైకల్‌ జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. 
 
ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని, తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానని పేర్కొన్నారు. పుదుచ్చేరి ప్రాంతం చాలా పవిత్రమైందని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి చాలా కాలం ఇక్కడ నివసరించారని అమిత్ షా తెలిపారు. అలాగే శ్రీ అరబిందో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే సమయంలో పుదుచ్చేరికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత పుదుచ్చేరిని దేశానికి మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. 
 
పాండిచ్చేరిలో ఇటీవల కుప్పకూలిన వి.నారాయణ స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంను ప్రస్తావిస్తూ దిగజారుడు రాజకీయాల కారణంగానే కేంద్ర ప్రభుత్వ పథకాలను పుదుచ్చేరిలో ఆయన అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడానికి బీజేపీనే కారణమని నారాయణ స్వామి తప్పుపడుతున్నారని, ఆనువంశ రాజకీయాల కారణంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుప్పకూలిందని, ఆ కారణంగానే అనేక మంది నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారని చెప్పారు. 
 
ఎన్డీయేను గెలిపిస్తే పుదుచ్చేరిలో 75 శాతంగా ఉన్న నిరుద్యోగిత‌ను 40 శాతానికి త‌గ్గిస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌త్స్య‌కారుల‌కు మంత్రిత్వ శాఖ లేదంటూ ఇటీవ‌ల కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన విమ‌ర్శ‌ల‌ను అమిత్ షా ప్ర‌స్తావించారు. మ‌త్స్య‌కారుల‌కు మంత్రిత్వ శాఖ ఏర్పాటై రెండేండ్ల‌యినా రాహుల్‌గాంధీ తెలియ‌క‌పోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని అమిత్ షా ఎద్దేవా చేశారు.    ‌