భారత దేశపు ఏకైన డీఎన్ఎ `హిందూ’ 

భారత దేశంపై గల ఏకైక డీఎన్ఎ “హిందూ”  అని ఆర్ ఎస్ ఎస్ సర్ సహా కార్యవాహ దత్తాత్రేయ హోసబలే స్పష్టం చేశారు. “సంఘ్ లో హిందూ అనే పదం జాతీయ పదమని, హిందూత్వకు ఒక గుర్తింపు ఉన్నదని చెప్పారు. ఈ భావనకు విభిన్నమైన ఆలోచనలు ఉన్నప్పటికీ లౌకికవాదులం అనుకునేవారు `హిందూ’ పదాన్ని `మతవాదం’గా ముద్ర వేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. 

ఆర్ ఎస్ ఎస్ అఖిల భారత సహా ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఆర్ ఎస్ ఎస్ పై “రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ -స్వర్ణిమ భారత్ కె దిశా సూత్ర” పేరుతో వ్రాసిన  గ్రంధాన్ని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలోలక్నోలో ఆవిష్కరిస్తూ ఈ వాఖ్యలు చేశారు. ఈ గ్రంధం ఆర్ ఎస్ ఎస్ గురించి అర్ధం చేసుకోవడానికి మార్గదర్శనం చేస్తుందని చెప్పారు.

వందేళ్ల క్రితం హిందూ అనే పదాన్ని విస్తృతమైన పరిధిలో చూసేవారని, అయితే భారత దేశపు సుదీర్ఘ సంప్రదాయాలను అర్ధం  చేసుకోలేని వారు ఇప్పుడు ఈ పదాన్ని `మతవాదం’గా అభివర్ణిస్తున్నారని దత్తాత్రేయ ఆక్షేపణ తెలిపారు. కొందరు మనం హిందువులం కాదని, భారతీయులమని అంటున్నారని పేర్కొంటూ “అది వారి అభిప్రాయం కావచ్చు. కానీ పేర్లు చాలా అముఖ్యమైనవి. మీరు మడోన్నా ఫోటో పెట్టి, క్రింద మరొకరి పేరు వ్రాయలేరు గదా” అని ప్రశ్నించారు.

అలాహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చడం ఆ నగరపు చరిత్రను ప్రతిబింబిస్తుంది తెలిపారు. భారత్ `హిందూ రాష్ట్ర‘గా మారితే ఏమవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన కొట్టిపారవేసారు. “ఆ విధంగా చెప్పేవారికి హిందూ, రాష్ట్ర  పదాల అర్ధాలు తెలియవు. మీరు అయోధ్య హోనోలులు అని పిలిస్తే సబబుగా ఉండదు” అని చెప్పారు.

ఎవరైనా ఆర్ ఎస్ ఎస్ ను అర్ధం చేసుకోవాలి అంటే ఆ సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలను అర్ధం చేసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఎటువంటి విపత్తులు సంభవించినా వెంటనే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు సేవా దృక్పథంతో పరిగెత్తుతూ ఉంటారని పేర్కొన్నారు.  కరోనా మహామ్మారి సమయంలో 60 లక్షల మంది రాష్ట్రానికి చెందిన, మరో 40 లక్షల మంది పొరుగు రాష్ట్రాలకు చెందిన సుమారు కోటి మంది వలస కార్మికుల కదలికలు జరిగినప్పుడు వారి కుల, మత, భాష పట్టింపులు లేకుండా ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు విలువైన సేవలు అందించారని ముఖ్యమంత్రి అభినందించారు.

అయితే విమర్శలు, పొగడ్తలను పట్టించుకోకుండా ఆర్ ఎస్ ఎస్ తన పని తాను చేసుకొంటూ పోతుందని ఆదిత్యనాథ్ చెప్పారు. ఇంతకు ముందు అంబేకర్ వ్రాసిన “21వ శతాబ్దంకు ఆర్ ఎస్ ఎస్ రోడ్ మ్యాప్స్” గ్రంధాన్ని 2019లో ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ ఆవిష్కరించారు.