భారత్ వ్యాపార్ బంద్‌లో పాల్గొనని వ్యాపారులు

వర్తక సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ వ్యాపార్ బంద్ సందర్భంగా శుక్రవారం దేశరాజధానిలోని అన్ని ప్రధాన మార్కెట్లు యధాప్రకారం పనిచేశాయి. ఆందోళనకు దుకాణదారులు మద్దతు ఇచ్చినప్పటికీ నష్టపోకూడదన్న ఉద్దేశంతో వ్యాపారులు తమ కార్యకలాపాలను శుక్రవారం నాడు కూడా కొనసాగించారు. జిఎస్‌టిలోని నిబంధనలను సమీక్షించాలని డిమాండు చేస్తూ ఫిబ్రవరి 26న దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు బంద్ పాటించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య(సిఎఐటి) పిలుపు ఇచ్చింది.

దేశవ్యాప్తంగా 1500 ప్రదేశాలలో ధర్నాలు జరుగుతాయని సిఎఐటి ప్రకటించింది. ఢిల్లీలో మార్కెట్లన్నీ తెరచినప్పటికీ వాటి సంఘాలు మాత్రం తమ బంద్‌కు మద్దతు ఇచ్చాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సిటిఐ) అధ్యక్షుడు బ్రిజేష్ గోయల్ తెలిపారు. చావ్రీ బజార్, కరోల్ బాగ్‌లోని కొన్ని ప్రాంతాలలో తప్పించి ఢిల్లీలోని 98 శాతం మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, పారిశ్రామిక వాడలు తెరిచే ఉన్నాయని ఆయయన చెప్పారు. అయితే వీరంతా తమ ఆందోళనకు మద్దతు తెలిపారని ఆయన చెప్పారు.

దేశం మొత్తం  ఇంధన ధరలు  ఒకేలా ఉండాలని సమాఖ్య జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్ వాల్ డిమాండ్ చేశారు. జీఎస్టీ నిబంధనల్లో సవరణలు చేయాలని గత ఆదివారమే ప్రధాని నరేంద్ర మోదీకి అఖిల భారత  వ్యాపారుల సమాఖ్య లేఖ వ్రాసింది. ఈ కామర్స్  సంస్థలను నియంత్రించాలని కోరింది. జీఎస్టీ బిల్లులో సవరణలకు  కేంద్ర స్థాయి  అధికారులతో  ప్రత్యేక బృందం  ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.