అభివృద్ధి పథకాలే అన్నాడీఎంకే కూటమిని గెలిపిస్తాయి 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి పథకాలే అన్నాడీఎంకే కూటమిని గెలిపిస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి జి.కిషన్‌రెడ్డి భరోసా వ్యక్తం చేశారు.  రాయపురం శాసనసభ నియోజకవర్గం ఆంజనేయనగర్‌లో నివసిస్తున్న ఆదిఆంధ్రులు, పలు తెలుగు సంఘాల నేతలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో  కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

వీధివీధికి వెళ్లి ఆయన తెలుగు వారిని పలకరించి వచ్చే ఏప్రిల్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమిని గెలిపించి మళ్లీ అధికారంలో కూర్చొబెట్టాలని అభ్యర్ధించారు.

తెలంగాణా రాష్ట్రానికి చెందిన తనను ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో స్థానంకల్పించారని, తమిళనాట ఇంతమంది తెలుగు వారి మధ్య మాతృభాషలో ప్రసంగించడం సంతోషంగా ఉందని  చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఐదేళ్ల క్రితం దురదృష్టవశాత్తు మరణించారని, ఆమె తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, ఆ పార్టీ నేతలు అమ్మ మాటను నిలబెట్టి సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి కొనియాడారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు రాష్ట్రప్రభుత్వాలతో కలిసి కేంద్రం చేపట్టిన ముందు చూపు చర్యల వల్ల ప్రస్తుతం భారతదేశంలో కరోనా ప్రభావం చాలావరకు తగ్గిందని తెలిపారు.  అన్నాడీఎంకే ప్రభుత్వం ద్వారా కేంద్రం పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుపరుస్తోందని, ఈ పథకాలే రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.