పేదల పక్షపాతి ఎంజిఆర్ 

తమిళనాడు మాజీ  ముఖ్యమంత్రి ఎంజిఆర్ పేదల పక్షపాతి అని, ఆయన తమిళనాడు ప్రజల కోసం నిస్వార్థంతో పని చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. త‌మిళ‌నాడులోని డాక్ట‌ర్ ఎంజిఆర్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ స్నాత‌కోత్స‌వంలో పాల్గొని వ‌ర్చువ‌ల్ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా  విద్యార్థుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.  
 
భార‌తీయ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ అత్యున్నత స్థాయికి చేరుకుందని, ప్రపంచం ఇప్పుడు భారతీయ ఆరోగ్య వ్యవస్థపై దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. అత్యుత్తమ విద్యార్థులుగా రాణించి సమాజ సేవలో పాల్గొనాలని ఆయన విద్యార్థులకు సూచించారు. భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని, రికవరీ రేటు ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు.  
 
శ్రీలంక‌లోని డిక్ ఓయా ఆసుపత్రిని ప్రారంభించడం తానెప్పుడూ మరిచిపోనని ఆయన తెలిపారు.  ఈ ఆధునిక ఆసుపత్రి నిరుపేదలకు ఎంతగానో సేవ చేస్తుందని ఆయన కొనియాడారు.  ఆరోగ్య రంగంలో ఈ ఆసుపత్రితో  త‌మిళ ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 
 
ఎంజిఆర్ బతికి ఉంటే ఈ ఆసుపత్రిని చూసి ఎంతో సంతోషించేవారని ఆయన వివరించారు. ఆరోగ్యం, విద్య, మ‌హిళా సాధికార‌త వంటి అంశాల‌పై ఎజిఆర్ దృష్టి పెట్టారని ఆయన స్పష్టం చేశారు. గతంలో శ్రీలంక‌లో ఎంజిఆర్ పుట్టిన గ్రామాన్ని తాను సందర్శించానని ఆయన వెల్లడించారు. శ్రీలంకలోని త‌మిళ‌ ప్రజల ఆరోగ్యం కోసం ప‌ని చేసేందుకు భార‌త్ క‌ట్టుబ‌డి ఉంద‌ని మోడీ స్పష్టం చేశారు.