స్వలింగ వివాహాలను అనుమతించలేం

మన దేశంలో స్వలింగ (ఆడ, ఆడ – మగ, మగ) వివాహాలకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకమని  తేల్చి చెప్పింది. ఇలాంటి వివాహాలను మన చట్టాలు, సమాజం, సంప్రదాయాలు, విలువలు గుర్తించవని తెలిపింది.  స్వలింగ వివాహాలను గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన  పిటిషన్లకు సమాధానంగా కేంద్రం గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. వీటిపై జస్టిస్‌ రాజీవ్‌ సహాయ్‌, జస్టిస్‌ అమిత్‌, బన్సల్‌లతో కూడిన బెంచ్‌ కేంద్రప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. 

‘‘ఇద్దరు స్వలింగ వ్యక్తులు కలిసి ఉండడాన్ని… భార్య, భర్త, పిల్లలు అనే భారతీయ కుటుంభ భావనతో పోల్చి చూడలేం. ఇలాంటి వివాహాలను రిజిస్టర్ చేస్తే  ప్రస్తుతమున్న చట్టాలను ఉల్లంఘించినట్లే అవుతుంది” అని కేంద్రం పేర్కొంది. ‘పెండ్లి అంటే ఇద్దరు వ్యక్తుల శారీరక కలయిక మాత్రమే కాదు. స్త్రీ, పురుషుల మధ్య అనుబంధాన్ని పట్టి ఉంచే గొప్ప వ్యవస్థ. స్వలింగ వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థలో ఇమడలేవు’ అని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. 

దేశంలోని వివిధ మత సంప్రదాయాలకు అనుగుణంగా పార్లమెంట్ వివాహ చట్టాలను రూపొందించిందని,ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా చేస్తే, పూర్తి వ్యవస్థ  దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. వివాహమనేది వ్యక్తిగత భావన కాదని, అది సమాజంతో ముడిపడి ఉందని తెలిపింది. మన దేశంలో వివాహాలకు చట్టబద్ధత ఉన్నప్పటికీ, దాని గుర్తింపు మాత్రం  ఎన్నో ఏండ్ల నాటి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సామాజిక విలువలపై ఆధారపడి ఉందని చెప్పింది.