అయోధ్యలో  సీతారామ్‌ బ్యాంకు

అయోధ్యలోని రామజన్మభూమిలో రామాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో నిధి సేకరణకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న తరుణంలో అయోధ్యలో రామయ్య కోసం అక్కడి భక్తులు ప్రత్యేకమైన బ్యాంకును ఏర్పాటు చేసిన్నట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాంకులో ఏ భక్తుడైనా ఖాతా తెరువొచ్చు. తమ పేరును బ్యాంకు రికార్డుల్లోకి ఎక్కించుకోవచ్చు. ఇదే నాలుగు దశాబ్దాల క్రితం వెలిసిన సీతారామ్‌ బ్యాంకు.

అకౌంట్‌ పేరు రామ్‌.. ఈ బ్యాంకులో డబ్బు జమ చేయడానికి బదులుగా రామ నామాన్ని రాసిన పుస్తకాలను అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ బ్యాంకులో 15 వేల కోట్లకు పైగా రామ నామం రాసిన పుస్తకాలు జమ అయ్యాయి. ఈ బ్యాంకును 1970 లో కార్తీక కృష్ణ పక్ష ఏకాదశి రోజున కంటోన్మెంట్‌ పీఠాధిపతి మహంత్ నృత్య గోపాల్‌దాస్‌ ప్రారంభించారు.

అప్పటి నుంచి పునీత్‌రామ్‌దాస్‌ బ్యాంకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. బ్యాంకులో అకౌంట్‌ తెరిచేవారికి 64 పేజీలతో ఉన్న పుస్తకాన్ని అందజేస్తారు. ఈ పుస్తకంలో 21 వేల రామ నామాలను రాసేందుకు వీలుగా గడీలు ఉంటాయి. ఈ బ్యాంకులో ఎవరైనా తమ పేరును నమోదు చేసుకోవచ్చునని, వారి అకౌంట్‌ తెరుచుకోవచ్చునని, అయితే తప్పనిసరిగా రామనామాన్ని 21 వేలకు తక్కువ కాకుండా రాసి అందజేయాల్సి ఉంటుందని పునీత్‌రామ్‌దాస్‌ తెలిపారు.

ఇలా ఏటా అత్యధికంగా రామ నామాలను రాస్తున్న భక్తులను గుర్తించి సత్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొందరు ఒక్క పుస్తకాన్ని నింపి అందజేస్తుండగా.. మరికొందరు నాలుగైదు పుస్తకాలు రాసి పట్టుకొస్తారని ఆయన వెల్లడించారు.

సీతారామ్‌ బ్యాంకులో ఇప్పటివరకు దాదాపు 27 వేలకు పైగా సభ్యులు ఉన్నారు. ఈ భక్తులు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఉండటం విశేషం. ప్రతి యేటా తమకు అందుతున్న పుస్తకాలను నిల్వచేసేందుకు సరైన ప్రదేశం లేనందున గత రెండున్నర దశాబ్దాలుగా సమీపంలో ఉన్న సరయూ నది ఒడిలోకి జారవిడుస్తున్నారు. 

ఈ బ్యాంకులో సేవలందించేందుకు నలుగురు ఉన్నారు. రామ మందిర నిర్మాణం పనులు ఊపందుకోవడంతో ఈ బ్యాంకుకు వచ్చే వారి సంఖ్య గత ఎనిమిది, తొమ్మిది నెలలుగా రెట్టింపు అయింది. ఆలయం పూర్తయిన తర్వాత వీక్షించేందుకు వచ్చే భక్తుల తాకిడి మరింత ఎక్కువగా  భావిస్తున్నారు.