సంబరాలు చేసుకొంటున్న పుదుచ్చేరీ ప్రజలు 

కాంగ్రెస్ పాలన ముగిసినందుకు పుదుచ్చేరీ ప్రజలు సంబరాలు చేసుకొంటున్నారన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది తనకు ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2016లో పుదుచ్చేరీ ప్రజలకు ప్రజా ప్రభుత్వం లభించలేదని స్పష్టం చేశారు. 
ఆ ప్రభుత్వం కాంగ్రెస్ హైకమాండ్ సేవలో బిజీగా ఉందని ధ్వజమెత్తారు.  ప్రజలనే హైకమాండ్ గా భావించే ప్రభుత్వం పుదుచ్చేరీ ప్రజలకు కావాలని సూచించారు.
 
పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  పుదుచ్చేరిలో కాంగ్రెస్ పాలన అచ్చం బ్రిటీష్ పాలన మాదిరిగానే సాగిందంటూ ఎద్దేవా చేశారు.
 
‘‘బ్రిటీష్ వాళ్లు విభజించు, పాలించు అనే విధానాన్ని అవలంబించేవాళ్లు. కాంగ్రెస్ కూడా విభజించు, అబద్దాలు చెప్పు, పాలించు అనే విధానాన్ని అవలంబిస్తోంది..’’ అని ప్రధాని పేర్కొన్నారు.
 
కేంద్రంలో మత్స్య శాఖ ఏర్పాటు చేయాలన్న రాహుల్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఆ శాఖను కేంద్ర ప్రభుత్వం 2019లోనే ఏర్పాటు చేసిన విషయం కాంగ్రెస్ మాజీ చీఫ్‌కు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని గుర్తు చేశారు.  ఇటీవల కేరళ, పుదుచ్చేరిలలో పర్యటించిన రాహుల్ గాంధీ.. అక్కడి ప్రజలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ నెల 17న రాహుల్ మాట్లాడుతూ.. ‘‘సముద్ర రైతులైన’’ జాలర్లకు ప్రత్యేకంగా ఓ శాఖ ఉండాలంటూ పేర్కొన్నారు. అయితే ఆ శాఖ ఇప్పటికే ఉందంటూ కేంద్ర మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సహా పలువురు బీజేపీ నేతలు రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.