చైనా సైనికుల మృతి సంఖ్యను ప్రశ్నించిన ముగ్గురు అరెస్ట్   

గల్వాన్‌ ఘర్షణలో మరణించిన చైనా సైనికుల సంఖ్యపై ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం చేసిన ముగ్గురు బ్లాగర్స్‌ను ఆ దేశ అధికారులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు నాన్జింగ్‌కు చెందిన 38 ఏండ్ల పరిశోధనాత్మక పాత్రికేయుడు క్యూ జిమింగ్ కూడా ఉన్నారు. 
 
గత ఏడాది జూన్‌ 15న లఢక్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద చైనా, భారత్‌ సైనికుల మధ్య జరిగిన ఘర్షణ వీడియోను చైనా మిలిటరీ శుక్రవారం విడుదల చేసింది. పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)కు చెందిన అమరులైన నలుగురు సైనికులతోపాటు గాయపడిన మరొక అధికారిని సైనిక లాంఛనాలతో సముచితంగా గౌరవించినట్లు అధికారికంగా పేర్కొంది. 
 
కాగా, గల్వాన్‌ ఘర్షణలో భారత్‌ జవాన్లు 20 మంది అమరులుకాగా, చనిపోయిన చైనా సైనికుల సంఖ్య 45 వరకు ఉంటుందని భారత రక్షణ వర్గాలతోపాటు విదేశీ మీడియా వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో పరిశోధనాత్మక పాత్రికేయుడు క్యూ జిమింగ్ తన బ్లాగ్‌లో చైనా అధికారికంగా పేర్కొన్న ఆ దేశ సైనికుల మరణాల సంఖ్యపై అనుమానం వ్యక్తం చేశారు. 
 
చైనా మిలిటరీ పేర్కొన్న దాని కంటే ఎక్కువ మంది సైనికులు చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఈ విషయాన్ని వెల్లడించడానికి 8 నెలల సమయం తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. 
 
క్యూ జిమింగ్‌ బ్లాగ్‌ రచనపై స్పందించిన చైనా అధికారులు శనివారం ఆయనను నాన్జింగ్‌లో అరెస్ట్‌ చేశారు.  అలాగే ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తిన మరో జర్నలిస్ట్‌ను బీజింగ్‌లో అరెస్ట్‌ చేశారు. పీఎల్‌ఏ సైనికులను అవమానించేలా కథనం పోస్ట్‌ చేసిన మరో వ్యక్తిని గత వారం సిచువాన్‌లో అదుపులోకి తీసుకున్నారు.