నద్దా సమక్షంలో బీజేపీలో చేరిన శ్రీశైలం గౌడ్

మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,  తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. 

అంతకుముందు.. ఆదివారం ఉదయమే కాంగ్రెస్‌ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి శ్రీశైలం గౌడ్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి  పంపించారు. 

కాగా, కాంగ్రెస్‌ అధిష్ఠానంపై, రాష్ట్ర నాయకత్వంపై శ్రీశైలం గౌడ్‌ కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌‌కు  ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

ఈ మేరకు ఇటీవల ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ విషయం తెలిసి.. కొందరు కాంగ్రెస్‌ నేతలు శ్రీశైలం గౌడ్‌ వద్దకు వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అప్పటికే బీజేపీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపి తమ పార్టీలో చేర్చుకునేందుకు మార్గం సుగమం చేశారు. 

కూన శ్రీశైలం గౌడ్‌ ఇప్పటివరకూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల రేవంత్‌ నిర్వహించిన పాదయాత్రలోనూ కీలక పాత్ర పోషించారు.

ఆయన కాంగ్రెస్‌‌ను వీడటం మేడ్చల్‌ జిలాల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు పార్టీలో రేవంత్‌ హవాకు కూడా కొంత దెబ్బేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నగర శివారు ప్రాంతాలకు చెందిన మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా పార్టీని వీడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది