రాష్టాలకు రూ 1 లక్ష కోట్ల జీఎస్టీ పరిహారం 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహార లోటును భర్తీ చేసేందుకు గతేడాది అక్టోబర్‌ నుంచి లక్ష కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో తెలంగాణకు రూ.1,940.95 కోట్లు, ఏపీకి రూ.2,222.71 కోట్లు అందాయి. 

శుక్రవారం 23 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.5 వేల కోట్లు విడుదల చేశామని, దీంతో ఇప్పటివరకు ప్రత్యేక రుణ గవాక్షం ద్వారా విడుదల చేసిన మొత్తం రూ.లక్ష కోట్లకు చేరిందని ఆర్థిక శాఖ వివరించింది.  అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కింలకు లోటు ఏర్పడలేదని తెలిపింది. 

జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదాయంలో ఏర్పడిన లోటులో రూ.1.10 కోట్లు భర్తీ చేసేందుకు కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రత్యేక రుణ గవాక్షాన్ని ఏర్పాటు చేసింది. ఈ లోటు భర్తీకి అవసరమయ్యే నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరఫున కేంద్రమే రుణాల రూపంలో సమీకరిస్తున్నది. 

రాష్ట్రాలకు హామీ ఇచ్చిన నిధుల్లో ఇప్పటివరకు 91 శాతం అందజేశామని, రూ.లక్ష కోట్లలో రాష్ర్టాలకు రూ.91,460.34 కోట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.8,539.66 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది.