నిమ్మగడ్డను సహాయంగా రంగంలోకి నాగిరెడ్డి!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ అనుమతితో నాలుగు దశలలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను పూర్తిచేసుకొని, మునిసిపల్ ఎన్నికల పక్రియను చేబడుతున్న తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహాయకారిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఎన్నికల కమీషనర్ వి నాగిరెడ్డి రంగంలోకి వచ్చారు.

మునిసిపల్ ఎన్నికలు, వాటి తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అసలే అరకొర సిబ్బందితో పనిచేస్తున్న ఎస్ఈసీ ‌పై ఇవన్నీ ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో గతంలో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వారి సేవలను వినియోగించుకోవాలని ఆయన నిర్ణయించారు. ఏపీ స్ధానిక సంస్దల ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి సలహాదారుడిగా సేవలు అందించేందుకు నాగిరెడ్డి సిద్ధమయ్యారు. నిమ్మగడ్డ  కోరిక మేరకు సేవలందించేందుకు ఆయన శనివారం విజయవాడ వచ్చి, ఆయనతో భేటీ అయ్యారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిమ్మగడ్డతో నాగిరెడ్డి సమావేశమై స్ధానిక ఎన్నికల్లో తాజా పరిస్ధితిని, ఇతర వివరాలను ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈసీ సలహాదారు హోదాలో ఇకపై నాగిరెడ్డి కూడా కీలక సమావేశాలను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.

నాగిరెడ్డితో జరిగిన సమావేశంలో ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధత, ఫిర్యాదులు, హైకోర్టులో కేసులు, కోర్టు ఆదేశాలు వంటి వాటిపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే విషయంలో వీరిద్దరూ కలిసి చర్చించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డకు సాయంతో అదనపు డీజీ సంజయ్‌తో పాటు ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా కన్నబాబు సహకారం అందిస్తున్నారు. 

ఇలా ఉండగా, మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ రమేశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్లు వేసి చనిపోయిన వారి స్థానాల్లో మళ్లీ నామినేషన్లు వేసేందుకు అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వార్డుల్లో మళ్లీ నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. 

ఈనెల 28న నామినేషన్, మార్చి 1న స్క్రూటిని, మార్చి 3న ఉపసంహరణ, అదే రోజు తుది జాబితా, 10న పోలింగ్ నిర్వహించనున్నారు. వైసీపీ నుంచి 28, టీడీపీ 17, బీజేపీ 5, సీపీఐ 3, కాంగ్రెస్ 2, జనసేన నుంచి ఒకరు నామినేషన్ వేసి మరణించినట్లు ఎస్ఈసీ ప్రకటించారు.. పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.