తిరిగి ప్యారిస్ ఒప్పందంలో చేరిన అమెరికా 

పారిస్‌ ఒప్పందంలోకి అమెరికా తిరిగి అడుగుపెట్టింది. గత అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్‌ హయాంలో పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగగా.. 107 రోజుల అనంతరం మళ్లీ చేరింది. శుక్రవారం నుంచి అధికారికంగా ఈ ఒప్పందంలో భాగస్వామ్యమైంది. 
 
జో బైడెన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా తిరిగి పారిస్‌ ఒప్పందంలో చేరడంపై ప్రపంచ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్  బాధ్యతలు చేపట్టక ముందు నుంచే పారిస్‌ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరుతుందని ప్రకటించారు. 
 
అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై తొలిరోజే సంతకం చేశారు. దీంతో శుక్రవారం (ఫిబ్రవరి 19)నుంచి అధికారికంగా పారిస్‌ ఒప్పందంలో అమెరికా చేరినట్లు అయ్యింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీ కాలం ముగిసిన నెల రోజులకే అమెరికా ఈ ఒప్పందంలో చేరడం విశేషం. 
 
 భూతాపాన్ని తగ్గించే లక్ష్యంతో ఒకేతాటిపై వచ్చిన ప్రపంచ దేశాలు 2015 పారిస్‌ వాతావరణ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. పారిస్‌ పర్యావరణ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరడం ఎంతో ముఖ్యమైన విషయమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ కొనియాడారు.