పుదుచ్చేరి ఎల్జీగా తమిళిసై ప్రమాణ స్వీకారం

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రమాణస్వీకారం చేశారు. పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో తమిళిసై చేత మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళిసై తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు.
 
ఇప్పటివరకు ఎల్జీగా కొనసాగిన కిరణ్‌ బేడిని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో తెలంగాణ గవర్నర్‌ అయిన తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి, అసెంబ్లీ స్పీకర్ వీపీ శివకోలందు, ఇతర మంత్రులు హాజరయ్యారు.
కిరణ్‌బేడి 2016 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పని చేశారు. పుదుచ్చేరిలో కిరణ్‌బేడి సహా నలుగురు మహిళలు లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా పని చేశారు. తమిళం మాట్లాడే వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం ఇదే తొలిసారి. పుదుచ్చేరి ఎల్జీగా ఓ మహిళ ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఐదోసారి. అంతకు పూర్వం చంద్రావతి, రాజేంద్ర కుమారి వాజ్‌పాయ్, రజనీ రాయ్, కిరణ్ బేడీ ఎల్జీగా బాధ్యతలు నిర్వర్తించారు.
 
దిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన కిరణ్‌ బేడిని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా 2016లో కేంద్రప్రభుత్వం నియమించింది. అయితే నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ఎల్జీకి వివాదాలు చెలరేగాయి. 
 
తమ రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో కిరణ్‌ బేడి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని, ఆమెను తొలగించాలంటూ సీఎం స్వయంగా దీక్షకు దిగారు. వారం క్రితం రాష్ట్రపతిని కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. మరోవంక, పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో అక్కడి రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి.