హిందూ ధార్మిక పరిషత్‌ను వెంటనే ఏర్పాటు చేయండి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు.
 
 ‘హిందూ ధార్మిక పరిషత్’ కోసం ప్రజలు ఎంతగానో ఎదిరిచూస్తున్నారని స్వరూపానందేంద్ర  సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. సాధ్యమైనంత త్వరలోనే ధార్మిక పరిషత్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం మంచిదని స్వామీజీ సీఎంకు సలహా ఇచ్చారు. దీంతో పాటు ఏపీలో వరుసగా జరిగిన దేవాలయాల విధ్వంసంపై కూడా ఇరువురూ చర్చించుకున్నారు. 
 
దేవాదాయ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలపై దేవాదాయ శాఖ తరపున తొందర్లోనే పీఠాధిపతుల సమావేశాన్ని నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని స్వామీజీ సీఎంకు సూచించారు. ఈ రెండు అంశాలతో పాటు వారసత్వ అర్చకత్వం విషయమూ వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది. 
 
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వారసత్వ అర్చకత్వం విషయంలో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, అయితే అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని స్వామీజీ హితవు చెప్పారు. స్వరూపానందేంద్ర చేసిన సూచనలపై సీఎం సానుకూలంగానే స్పందించినట్లు చెబుతున్నారు.