ప్రాజెక్టుల పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దోపిడీ 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను కోరారు. ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగమవుతోందని ఆరోపించారు.

 శనివారం కేంద్ర జల శక్తి శాఖ సలహాదారు వెదిరెశ్రీరామ్‌తో కలిసి జావడేకర్‌ను కలిసిన సంజయ్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణలో మరిన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. 

‘‘ఏ సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలన్నా ముందుగా డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను తయారు చేసి సంబంధిత శాఖకు ఇస్తారు. తద్వారా ఆ శాఖ అనుమతితో పాటు పర్యావరణ శాఖ అనుమతి వచ్చాకే ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రాజెక్టు డీపీఆర్‌ను కూడా కేంద్ర జలశక్తి శాఖకు పంపలేదు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది” అంటూ ఆరోపించారు. 

 ప్రభుత్వం మధ్య మధ్యలో తమకు ఇష్టం వచ్చినట్లు నిర్మాణ వ్యయాన్ని పెంచుతోందని, దీని ద్వారా కాంట్రాక్టర్లకు భారీగా లాభం చేకూర్చి.. వారి నుంచి కమీషన్లు దండుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖ ఎన్నిసార్లు డీపీఆర్‌లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వెనుక ఉన్న దురుద్దేశం ఇదే అని స్పష్టం చేశారు.

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ)ను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ శాఖ అనుమతి తీసుకుంటున్నారని, లేకుంటే ఎన్జీటీ స్టే ఇస్తుందని భయం అని తెలిపారు. అయితే పర్యావరణ శాఖ కేవలం పర్యావరణ అంశాలనే పరిగణనలోకి తీసుకుంటుందని, దీంతో తప్పించుకునేందుకు అవకాశాలు దొరుకుతున్నాయని ఆయన విమర్శించారు.

అందుకే జలశక్తి శాఖ ఆమోదం తర్వాతే పర్యావరణ అనుమతి ఇచ్చేలా నిబంధన రూపొందించమని ఆయన జావడేకర్‌ను కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నిబంధనల్లో తేవాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని సంజయ్‌ తెలిపారు.