మమతా బెనర్జీ బాటలో కేసీఆర్

మమతా బెనర్జీ బాటలో కేసీఆర్

బెంగాల్‌ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ బాటలో కేసీఆర్‌ నడుస్తున్నారని, రాష్ట్రంలో బీజేపీని అణచివేసే కుట్ర చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.  ఢిల్లీలో ఎంపీలు డి.అర్వింద్‌, సోయం బాపురావు, మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి  విలేకరులతో మాట్లా.డుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని మండిపడ్డారు. 

సూర్యాపేట జిల్లా గుర్రంబోడు తండాలో 40 మంది పేద గిరిజనులపై హత్యాయత్నం కేసు పెట్టి పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని, రెండు నెలలుగా జైల్లో పెట్టారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జా చేసిన భూములకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. 

‘‘బీజేపీ కార్యకర్తలపై దాడులు, వేధింపులు ఐజీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో జరుగుతున్నాయి. ఆయనకు భయమం టే ఏంటో చూపిస్తా. ప్రభాకర్‌రావు తీరును కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తా. ఆయన అక్రమ ఆస్తుల చిట్టాను బయటపెడతా. సూర్యాపేటకు మళ్లీ వెళ్తా. దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి’’ అని సవాల్ చేశారు. 

అయితే పోలీసులతో తమకు శత్రుత్వం లేదని, వారి సమస్యలపైనా తాము పోరాటం చేస్తున్నామని సంజయ్ స్పష్టం చేశారు. గిరిజనుల భూమి కబ్జా వెనుక ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి పాత్ర ఉందని ఆరోపించారు.

జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో మజ్లిస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాయని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను దోచుకోవడానికి ఆ రెండు పార్టీలు సిద్ధమయ్యాయని ఆరోపించారు. వారి నుంచి బీజేపీ కాపాడుతుందని స్పష్టం చేశారు. పైవేటు టీచర్లను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.