కాంగ్రెస్ నేతల వివక్షతకు గురైన దామోదరం సంజీవయ్య 

* శత జయంతి నివాళి 

దేశం మొత్తం మీద అతి పిన్న వయస్సులు, 38 ఏళ్లకే మొదటగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడమే కాకుండా, కాంగ్రెస్ కు రెండు సార్లు అధ్యక్ష పదవి చేపట్టిన తొలి దళిత్ నేత దామోదరం సంజీవయ్య నీతి నిజాయితీలకు, ప్రజా సంక్షేమంపై, అట్టడుగు వర్గాల వారి ఉన్నతి కోసం జీవితాంతరం పోరాడిన యోధుడు. సుదీర్ఘకాలం దళితుల ఓట్లతో కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నేతలు నేటి తెలుగు రాష్ట్రాలలో దళితుల పట్ల ప్రదర్శించిన వివక్షతకు నిదర్శనంగా ఆయన నిలుస్తారు. 

 ఆయన నిరాడంబరుడు, స్నేహశీలి, దేశభక్తుడు, బహుజనుల పక్షపాతి. ప్రజల కోసం జీవితాంతం పోరాడిన కృషీవలుడు, నేరచరిత్ర లేనివాడు, నిజాయితీకి మారుపేరు,  భారతీయ సంస్కృతి మూర్తీభవించిన మహోదాత్తుడు. పదవులకోసం, ఆయన ఎప్పుడూ ఆరాటపడ లేదు. నీతి, నిజాయితీ, నిబద్ధత గల నాయకుడు

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో సుంకులమ్మ, మునిదాసు దంపతులకు 1921 ఫిబ్రవరి 14న సంజీవయ్య జన్మించారు. 1950లో మద్రాసు వెళ్ళి న్యాయశాస్త్రంలో పట్టభద్రులై అక్కడే న్యాయవాద వృత్తి చేపట్టారు. భారతదేశంలో మొదటిసారిగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి ప్రొవిజినల్‌ పార్లమెంటు సభ్యునిగా, హోం విభాగ సభ్యునిగా బాధ్యతలు సమర్ధంగా నిర్వహించారు.

1952లో కర్నూలు నుంచి సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది రాజాజీ కేబినెట్‌లో మున్సిపల్‌ శాఖామంత్రిగా పనిచేశారు. 1953లో టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆరోగ్యం, పునరావాసం, హరిజనోద్ధరణ, ప్రణాళికలు, మాజీ సైనికుల సంక్షేమ శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1954 మే 7న సికింద్రాబాద్‌కు చెందిన బుచ్చయ్య కూతురు కృష్ణవేణమ్మను కులాంతర వివాహం చేసుకున్నారు.

1955 ఆంధ్రరాష్ట్ర మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మిగనూరు – కోడుమూరు ఉమ్మడి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి రవాణా, వాణిజ్యపన్నుల శాఖామంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 1956 నవంబర్‌ 1వ తేదిన ఆంధ్రరాష్ట్రం – హైదరాబాద్‌ రాష్ట్రం స్వపరిపాలన, కార్మికశాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1960 జనవరి 11న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

1962లో అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికై, 1964లో నెహ్రూ మంత్రివర్గంలో కార్మికమంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీకి రెండవ పర్యాయం జాతీయ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1962లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర నాయకుడిగా ముందుండి కాంగ్రెస్‌ పార్టీకి 175 స్థానాల్లో అమోఘమైన విజయాన్ని అందించిన ఘనత కేవలం సంజీవయ్యకే దక్కుతుంది. 

సంజీవయ్య ముఖ్యమంత్రిగా పని చేసింది కేవలం (1960–1962) రెండేళ్ల స్వల్పకాలం మాత్రమే. తమ సామాజిక వర్గానికి చెందిన వారిని కాదని ఆ పదవి ఏవిధంగా చేబడతారంటూ నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ఆయనను గద్దె దించేవరకు నిద్రపోలేదు.

నాటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఆయనను లోక్ సభకు తీసుకు రావాలని రిజర్వు కానీ కర్నూల్ నుండి పోటీ చేయనిస్తే, కోట్ల విజయభాస్కరరెడ్డి పట్టుబట్టి మరీ ఓడించారు. ఆ తర్వాత ఆమె ఆయనను రాజ్యసభకు తీసుకు వెళ్ళింది. కేవలం ఒక దళితుడు కావడం కారణంగానే ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం కొనసాగలేకపోయారు. 

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన ప్రముఖ బీజేపీ దళిత్ నేత పార్లమెంట్ లో షెడ్యూల్ కులాల ఎంపీల ఫోరమ్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అప్పుడు దామోదరం సంజీవయ్య సహకారంతో ఆయన ఏర్పాటు చేయగలిగారు. 

సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనంటే గిట్టనివారు పధ్రాని నెహ్రూకి అనేక ఫిర్యాదులు చేశారు. నిజనిజాలను తేల్చేందుకు నెహ్రూ అప్పటి హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పర్మార్‌ను పంపించారు. ఆయన హైదరాబాద్‌ నుంచి కర్నూలు చేరుకుని సంజీవయ్య స్వగ్రామమైన పెదపాడును సందర్శించారు. 

ఆ సందర్భంలో పర్మార్‌తో పాటు యువనేత చక్రపాణి (తదనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా పని చేశారు) కూడా వెళ్ళారు. వారు ప్రయాణిస్తున్న కారు ఓ పూరింటి ముందు ఆగింది. దాన్ని చూసి ‘ఇక్కడెందుకు ఆపారు. మనం వెళ్ళాల్సింది సంజీవయ్య ఇంటికి కదా’ అని పర్మార్‌ అడిగారట. 

అప్పుడు చక్రపాణి ‘ఇదే సంజీవయ్య ఇల్లు’ అని చెప్పడంతో పర్మార్‌ ఆశ్చర్యపోయారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే.. వృద్ధురాలైన సంజీవయ్య తల్లి సుంకులమ్మ కట్టెలపొయ్యి దగ్గర వంట చేస్తూ కనిపించారు. ఆ దృశ్యం ఊసి పర్మార్‌ చలించిపోయి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారట.

ఆయన రాజకీయ నాయకుడే కాకుండా మంచి సాహిత్య వేత్త కూడా. ఆయన హయాంలోనే సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీలను ఏర్పాటు చేశారు. తెలుగును అధికార భాషగా, ఉర్దూ రెండవ భాషగా ఆయన హయాంలోనే నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులోనే విధిగా ఉత్తరప్రత్యుత్తరాలు జరగాలని ఉత్తర్వులు జారీ చేశారు. 

పాలనలో నిజాయతికోసం తీవ్ర తపన చెందారు. దేశం మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి ఆరోపణలపై విచారణకు ఏసీబీని ఏర్పాటు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయనే కావడం గమనార్హం.

ఒకసారి సంజీవయ్య గారు పుట్టిన ఊరుకు తన తల్లిని చూడటానికి వచ్చి తిరిగి వెళుతూ ఆమె చేతిలో వందరూపాయలు పెట్టారు. ‘వృద్ధాప్యంలో వున్న మిగతా వారికి ఎవరు చేస్తారు ఇటువంటి సహాయం’ అన్న తల్లి మాటలు సంజీవయ్యను ఆలోచనల్లో పడేసింది. దాని ఫలితమే వృద్ధాప్య ఫించను పథకం రూపకల్పన.

ముఖ్యమంత్రిగా సంజీవయ్య అనేక వినూత్న కార్యక్రమాలు రూపకల్పన చేశారు. లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంపిణీ చేశారు. రాయలసీమ, కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర ప్రజలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా జిల్లాల్లో సాగునీరు, త్రాగునీరు అందుతుంది. ఎస్‌సి, ఎస్‌టి, బి.సిలకు సేవా సహకార సంఘాలను స్థాపించారు. వీటిద్వారా బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో కృషిచేశారు.

మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నో పదవులు నిర్వహించిన సంజీవయ్యకు చనిపోయే నాటికి ఉన్నది ఒక పాత ఫియెట్‌ కారు, రూ.17,000 బ్యాంకు బ్యాలెన్స్‌ మాత్రమేనంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకోకూడదన్న నియమానికి కట్టుబడ్డ నేత సంజీవయ్య. కనీసం సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన నిజాయితీని అర్థం చేసుకోవచ్చు. 1972 మే 8న ఆయన మృతి చెందారు.