వ్యవసాయ సంస్కరణలు భారత్ అంతరంగికం.. బ్రిటన్ స్పష్టం 

భారత ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ సంస్కరణలు ఆ దేశ సొంత విధానపరమైన అంశమని బ్రిటన్ స్పష్టం చేసింది. అయితే కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల ఉద్యమాలను నిశితంగా గమనిస్తామని తెలిపింది. రానున్న శతాబ్దంలో భారత్‌తో మైత్రి మరింత బలోపేతమవుతుందని పేర్కొంది.

బ్రిటిష్ పార్లమెంటులో కామన్స్ సభ నేత జాకోబ్ రీస్-మోగ్ మాట్లాడుతూ, భారత దేశంలో రైతుల ఉద్యమాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కులకు ఛాంపియన్‌గా తాము కొనసాగుతామని చెప్పారు.  ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి చైర్మన్ పదవిని ఈ నెలలోనే చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ పదవిని చేపట్టడం మానవ హక్కులకు ఛాంపియన్‌గా కొనసాగడంలో భాగమేనని తెలిపారు. 

భారత దేశంలో రైతు నిరసనకారులకు భద్రత, పత్రికా స్వేచ్ఛలపై బ్రిటష్ పార్లమెంటులో చర్చ జరగాలని బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ, పంజాబ్ మూలాలుగల తన్‌మంజీత్ సింగ్ దేశీ  పట్టుబట్టారు. భారత దేశంలో రైతులు నిర్వహిస్తున్న శాంతియుత ఉద్యమం ప్రపంచంలో అత్యంత భారీ నిరసన అని పేర్కొన్నారు. 

నెలల తరబడి ఈ ఉద్యమం కొనసాగుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బ్రిటిష్ ప్రధాన మంత్రికి 100 మందికి పైగా పార్లమెంటు సభ్యుల సంతకాలతో ఓ లేఖను పంపించినట్లు తెలిపారు. 650 యూకే నియోజకవర్గాలకు చెందిన లక్ష మందికి పైగా ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారని పేర్కొన్నారు. 

దీనిపై రీస్-మోగ్ స్పందిస్తూ, తన్‌మంజీత్ లేవనెత్తిన అంశం చాలా ముఖ్యమైనదని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రాథమిక హక్కు అని తెలిపారు. అయితే భారత దేశం గర్వించదగిన ప్రజాస్వామిక దేశమని గుర్తు చేశారు. 

భారత దేశంతో బ్రిటన్‌కు పటిష్ట సంబంధాలు ఉన్నాయని చెబుతూ . రాబోయే శతాబ్దంలో భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలు మరింత బలపడతాయని తాను భావిస్తున్నానని తెలిపారు. రానున్న శతాబ్దంలో ప్రపంచ దేశాలతో బ్రిటన్ సంబంధాల్లో భారత్‌తో సంబంధాలు అత్యంత ముఖ్యమైనవి అవుతాయని తాను భావిస్తున్నానని ప్రకటించారు. 

భారత దేశం బ్రిటన్‌కు మిత్ర దేశం కాబట్టి, ఆ మిత్ర దేశం ప్రతిష్ఠకు తగినట్లుగా పరిణామాలు లేనట్లు భావించినపుడు వినతులు సమర్పించే హక్కు మాత్రమే బ్రిటన్‌కు ఉందని స్పష్టం చేశారు. బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి గత డిసెంబరులో రైతుల నిరసనలపై భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శితో మాట్లాడారని చెప్పారు.