గవర్నర్‌కు విమానం నిరాకరణ‌పై ఫడ్నవీస్‌ ఆగ్రహం   

మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారికి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం విమానాన్ని వినియోగించుకునేందుకు అనుమతి నిరాకరించడం పట్ల బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మహారాష్ట్ర చరిత్రలో చీకటి అథ్యాయమని అభివర్ణించారు.
 ‘ఇది దురదృష్టకర ఘటన..గవర్నర్‌కేవలం ఓ వ్యక్తి కాదు..ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నారు..ఇది రాష్ట్ర చరిత్రలో చీకటి అథ్యాయంగా నిలిచిపోతుంద’ని ఫడ్నవీస్‌ ద్వజమెత్తారు. గవర్నర్‌ కోష్యారి రాష్ట్ర ప్రభుత్వ విమానం ద్వారా డెహ్రాడూన్‌కు వెళ్లాల్సి ఉంది. డెహ్రాడూన్‌కు వెళ్ల‌డానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన కోషియారీ.. రెండు గంట‌ల పాటు అక్క‌డే వేచి చూడాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆయ‌న విమానం ఎక్కి కూర్చున్న త‌ర్వాత కూడా 15 నిమిషాల పాటు వేచి చూశారు.
అప్ప‌టికీ త‌న‌కు టేకాఫ్‌కు అనుమ‌తి రాలేద‌ని ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చెప్ప‌డంతో కోషియారీ చివ‌రికి మ‌రో వాణిజ్య  విమానంలో టికెట్ బుక్ చేసుకొని వెళ్లాల్సి వ‌చ్చింది. వారం కింద‌టే గ‌వ‌ర్న‌ర్ టూర్ గురించి ప్ర‌భుత్వానికి చెప్పినా.. అనుమ‌తి రాక‌పోవడం చాలా అస‌హజంగా ఉన్న‌ద‌ని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌య వ‌ర్గాలు చెప్పాయి.
గ‌తేడాది అక్టోబ‌ర్‌లో రాష్ట్రంలో ప్రార్థ‌నాల‌యాల‌కు అనుమ‌తించిన‌ప్ప‌టి నుంచీ గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్యమంత్రిల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. హిందుత్వ ఓట్ల కోసం చూసే ఉద్ధ‌వ్‌.. సెక్యుల‌ర్‌గా మారార‌ని అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ సెటైర్ వేశారు. ముంబై విమానాశ్రయంలో గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వ విమానంలో ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించడం రాజకీయంగా దుమారం రేపింది.