రాహుల్ కు ఉన్న హక్కు రైతులకు ఉండదా!

సాగు చట్టాలపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమేథీ నుంచి గానీ, వయనాడ్ నుంచి గానీ పోటీ చేసే హక్కు రాహుల్‌కు ఎలాగైతే ఉందో… అలాగే ఎక్కడైనా అమ్మిన పంటను అమ్ముకునే హక్కు రైతాంగానికి కూడా ఉందని అనురాగ్ స్పష్టం చేశారు. 
 
నలుగురు మాత్రమే దేశాన్ని నడిపిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారని, ఆ జాబితాలో ప్రియాంక, రాబర్ట్ వాద్రాను కూడా కలుపుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాగు చట్టాలతో మండీలకు నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ పదే పదే ప్రచారం చేస్తోందని, మండీలకు నష్టం వాటిల్లే నిబంధనలేవీ సాగు చట్టాల్లో లేవని ఆయన స్పష్టం చేశారు. 
 
లేని నిబంధనలను కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, వారి తెలివితేటలు ఏమేరకు ఉన్నాయో ఇట్టేఅర్థమైపోతోందని అనురాగ్ ఎద్దేవా చేశారు.   ‘‘ మండీలకు నష్టం వాటిల్లే ఒక్క నిబంధన కూడా కూడా చట్టాల్లో లేదు. కాంగ్రెస్‌కు ప్రాథమిక సమాచారం కూడా లేదు. రైతు భుజాలపై తుపాకీని పెట్టి కాలుస్తారు. దీన్ని బట్టే వారికి ఎంత విషయ పరిజ్ఞానం ఉందో అర్థమైపోతుంది.’’ అని అనురాగ్ ధ్వజమెత్తారు. 
 
ఈ-నామ్ వ్యవస్థకు తాము వెయ్యి మండీలను జత చేశామని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటి వరకు రూ  1.14 లక్షల కోట్లను పంపిణీ చేశామని ఆయన గుర్తు చేశారు. బడ్జెట్ ప్రసంగ విషయంపై రాహుల్ ఎలాంటి ముందస్తు సన్నద్ధం కాకుండా వచ్చారని దీన్నిబట్టే అర్థమైపోతోందని అంటూ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో సభలోనే లేరని అనురాగ్ మండిపడ్డారు.