మే తర్వాత సీఎం పీఠానికి దీదీ దూరం

త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 స్ధానాలకు పైగా గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. మే తర్వాత మమతా బెనర్జీ బెంగాల్‌ సీఎం పీఠంపై ఉండబోరని జోస్యం చెప్పారు. బెంగాల్‌ ప్రజలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను దీదీ సర్కార్‌ నీరుగార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కూచ్‌బెహర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్‌ షా మాట్లాడారు.

బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మమతా ప్రభుత్వం నిలిపివేసిన సొమ్మును రైతుల ఖాతాల్లోకి మళ్లిస్తామని అన్నారు. జై శ్రీరాం నినాదాలు కూడా బెంగాల్‌లో నేరంగా పరిగణించే పరిస్థితి నెలకొందని, జై శ్రీరాం నినాదాలు ఇక్కడ కాకుండా పాకిస్తాన్‌లో చేయాలా అని ఆయన ప్రశ్నించారు. 

సుమారు 130 మంది బీజేపీ కార్యకర్తలను  టీఎంసీ గూండాలు హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, వీరిపై ఎటువంటి చర్య తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలను మట్టుబెడుతున్నారని, మమతా బెనర్జీ ప్రభుత్వంలో ప్రజలు భయాందోళనల మధ్య బతుకీడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికలు ముగిసే నాటికి మమతా దీదీ సైతం జై శ్రీరాం అని నినదిస్తారని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్‌ నుంచి రాష్ట్రంలోకి చొరబాట్లను అంతం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌లను ప్రస్తావిస్తూ, అత్త-అల్లుళ్ల పరిపాలనలో విస్తరించిన అవినీతిని అంతమొందిస్తామని చెప్పారు.

‘‘మీరు, మీ మేనల్లుడు కలిసి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను నిలిపేశారు. మే నెల తర్వాత ఇక ఆ పథకాలను ఆపలేరు, ఎందుకంటే, మీరు మే నెల తర్వాత ముఖ్యమంత్రిగా ఉండబోరు’’ అని అమిత్ షా అన్నారు.

ఇలా ఉండగా, ముఖ్య‌మం మ‌మ‌తా బెన‌ర్జీ పశ్చిమ బెంగాల్‌ను త‌న జాగీరుగా మార్చుకున్నార‌ని ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ్‌దీప్ ధ‌న్‌ఖార్‌ విమర్శించారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడిన ఆయ‌న‌.. మ‌మ‌త‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌జాస్వామ్యం మ‌నుగ‌డ సాగించాలంటే ముందుగా శుభ్రం చేయాల్సింది ప‌శ్చిమ బెంగాల్‌నే అని ఆయ‌న అన‌డం గ‌మ‌నార్హం. 

నేను డైమండ్ హార్బ‌ర్‌కు వెళ్తే గ‌వ‌ర్న‌ర్‌కు గార్డ్ ఆఫ్ హాన‌ర్ ఇవ్వొద‌న్న సందేశం వెళ్తోంది. ఇదేమైనా సొంత జాగీరా అని జ‌గ్‌దీప్ ప్ర‌శ్నించారు. బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా జ‌గ్‌దీప్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ రాజ్‌భ‌వ‌న్‌తో ముఖ్య‌మంత్రి సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. 

శాంతిభ‌ద్ర‌త‌లు, పాల‌న‌, అవినీతి విష‌యాల్లో ఇప్ప‌టికే గ‌వర్న‌ర్‌, సీఎం మ‌ధ్య చాలా వివాదాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం బెంగాల్‌లో ప‌రిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. 

ద‌శాబ్దాల కింద‌ట ప‌శ్చిమ బెంగాల్ సంస్కృతికి కేంద్రంగా, ప‌రిశ్ర‌మ‌ల్లో నంబ‌ర్ వ‌న్‌గా ఉండేద‌ని.. కానీ ఇప్పుడు మాత్రం నిరుద్యోగం పెరిగిపోయి, ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లిపోయి, సేవ‌ల రంగం లేక దారుణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయని గ‌వ‌ర్న‌ర్ ఆరోపించారు. రాష్ట్రంలో అస‌లు చ‌ట్టాలే అమ‌లు కావ‌డం లేద‌ని, గ‌వ‌ర్న‌ర్‌గా ఈ విష‌యం త‌న‌కు బాగా తెలుస‌ని చెప్పారు.