‘న్యూస్‌క్లిక్‌’పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు 

న్యూస్‌క్లిక్‌ అనే న్యూస్‌ పోర్టల్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మంగళవారం ఏకకాలంలో దాడులు చేపట్టింది. మొత్తం ఎనిమిది చోట్ల దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు చెప్పారు.

మనీ లాండరింగ్‌ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికోసం ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. వీరు నడుపుతున్న వెబ్‌సైట్‌ పేరు న్యూస్‌క్లిక్‌.ఇన్‌ అని తెలిపారు. 
 
కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, ఖాతాలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పలువురిని ప్రశ్నించినట్టు సమాచారం. దానికి ప్రబీర్‌ పుర్కాయస్త ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా పని చేస్తున్నారు.
తమపై దాడి జరగడంపై ఆయన స్పందిస్తూ.. జర్నలిజాన్ని తొక్కేసేందుకు, నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు కేంద్రం ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం.. ఆ న్యూస్‌ పోర్టల్‌కు విదేశాల నుంచి వస్తున్న నిధుల్లో అవకతవకలు ఉన్న కారణంగా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.