కేంద్రమంత్రి మందలింపు.. విజయసాయి క్షమాపణలు

కేంద్రమంత్రి మందలింపు.. విజయసాయి క్షమాపణలు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా   తీవ్ర విమర్శలకు గురయ్యాయి. `మీ మనసు, ఆత్మ బిజెపి పైన! తనువు టిడిపి పైన’ అని విజయసాయి వ్యాఖ్యానించడంతో పార్టీలకు అతీతంగా సభ్యులందరూ నివ్వెర పోయారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపి జైరాం రమేష్‌, బిజూ జనతాదళ్‌ సభాపక్ష నేత ప్రసన్న ఆచార్యలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

సాయి రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ సభ్యులందరూ సర్వత్రా ఈ వ్యాఖ్యలను ఖండించడంతో విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. 

‘నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదు. ఆవేశంలో మాట్లాడాను.. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను. భవిష్యత్‌లో ఈ విధంగా జరగదని హామీ ఇస్తున్నాను’ అని విజయసాయిరెడ్డి రాజ్యసభలో వెల్లడించారు.

అంతకుముందు విజయసాయిరెడ్డిని కేంద్ర పార్లమెంటరి వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మందలించారు. ‘నిన్న ఉపరాష్ట్రపతి పట్ల మీరు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు. రాజ్యసభ చైర్మన్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నిన్న జరిగింది నిందించదగినది. ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలి’ అని విజయసాయిని జోషి మందలించారు. ఈ మందలింపు అనంతరం రాజ్యసభకు వెళ్లిన విజయసాయి ‘ఐయామ్ సారీ’ అంటూ చెప్పారు.