అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లపై ఉత్తర్వులు

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లపై ఉత్తర్వులు
ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కలిపించే ఉత్తర్వులను సోమవారం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కలిపించనున్నట్టు ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలోనే సోమవారం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్రంలో ఇప్పటికే బడుగు బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్‌తో కలుపుకొని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.
 
ఆర్థికంగా వెనుకబడినవర్గాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్‌లకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. 19 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ రిజర్వేషన్లను ఇప్పటికే అమలు చేస్తున్నాయి. 
 
ఇప్పటి వరకు వీటిని అమలు చేయడానికి విముఖంగా ఉంటూ వచ్చిన కేసీఆర్ ఇప్పడు తెలంగాణలో సైతం ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు వర్తింప చేయనున్నారు. ఈ విషయమై బిజెపి రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నది.