
ప్రతిపక్షాలు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడంతో ఎటువంటి అర్ధం లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దశాబ్దాలుగా ఇటువంటి సంస్కరణలు రాకుండా అడ్డుకొంటున్నారని మండిపడ్డారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ శరద్ పవర్, ఇక్కడ ప్రసంగించిన కాంగ్రెస్ నేతలు అందరు అధికారమలో ఉన్నప్పుడు వ్యవసాయ సంస్కరణల కోసం ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.
ఉద్యమిస్తున్న రైతులు తిరిగి వెనుకకు వెళ్లాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. వారితో అన్ని అంశాలపై చర్చలకు ప్రధాని సిద్ధంగా ఉన్నదని హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధరను తొలగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రైతులకు సాధికారికత కల్పించడం కోసం వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకు రావడానికి తమ ప్రభుత్వం 2014 నుండి కృషి చేస్తున్నదని తెలిపారు.
వారు చేయలేని పని తాము చేస్తుంటే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రధాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విలువైన సూచనలు సభలో చేసిన మాజీ ప్రధాని దేవగౌడకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన పలు పధకాలు రైతులకు, ముఖ్యంగా చిన్న రైతులకు బాసటగా నిలుస్తున్నాయని చెప్పారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ‘‘పెద్ద పెద్ద మార్కెట్ వ్యవస్థలను తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయి. వాటిని తొలగించి, రైతులకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నాం. మన్మోహన్ సింగ్ అన్న వ్యాఖ్యలనే నేను ఉటంకిస్తున్నాను. దానికి మీరు గర్వపడాలి.’’ అని మోదీ పేర్కొన్నారు.
గతంలో అందరు నేతలూ వ్యవసాయ సంస్కరణలకు అనుకూలంగా మాట్లాడిన వారేనని, ఇప్పుడు మాత్రం రాజకీయాల కోసం యూటర్న్ తీసుకున్నారని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయ సంస్కరణలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా మాట్లాడారని, ఇప్పటికీ ఆయన సంస్కరణలకు ఏమాత్రం వ్యతిరేకి కాదని పేర్కొన్నారు. రైతులకు ఏది మేలు చేకూరుస్తుందో వాటినే తీసుకొస్తున్నామని, ఇకపై కూడా తీసుకొస్తామని మోదీ స్పష్టం చేశారు.
సభలో టిఎంసి సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ఎద్దేవా చేశారు. “దెబ్రేక్ జి ప్రసంగాన్ని నేను విన్నాను. ఆయన ప్రసంగించే స్వేచ్ఛ, వేధింపులు వంటి మంచి పదాలను ఎంచుకున్నారు. అయితే ఆయన బెంగాల్ గురించి మాట్లాడుతున్నారా లేదా మొత్తం దేశం గురించి మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యపోయాను. 24 గంటలు ఆయన ఇటువంటి పరిస్థితులనే చూస్తూ ఉండడంతో ఆయన ఇక్కడ కూడా ప్రస్తావించి ఉండవచ్చని అనుకొంటున్నాను” అని చెప్పారు.
అయితే ప్రధాని ప్రసంగం ప్రారంభించగానే దెబ్రేక్ తోపాటు ఆయన పార్టీ ఎంపీలు అందరు వాక్ అవుట్ చేసి వెళ్లిపోయారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించడం పట్ల ప్రధాని విచారం వ్యక్తం చేశారు.
భారత దేశాన్ని `ప్రజాస్వామ్య దేవాలయం’గా అభివర్ణిస్తూ, రాష్ట్రపతి ప్రసంగం ఎంత శక్తివంతమైనది అంటే ఆయన ప్రసంగం వినకుండానే సభ్యులు ఆయన ప్రసంగంలోని అంశాలను సభలో ప్రస్తావించారని ప్రధాని విసుర్లు విసిరారు. భారత దేశ జాతీయవాదం సంకుతిచమైనదో లేదా స్వార్ధపూరితమైనది కాదని అంటూ “సత్యం, శివమ్, సుందరం విలువలతో స్ఫూర్తి పొందింది” అన్న నేతాజీ మాటలను ఉటంకించారు.
యావత్ ప్రపంచం మొత్తం నేడు భారత్‌పైనే దృష్టి పెట్టినట్లు ప్రధాని తెలిపారు. భారత్‌పై ప్రతి ఒక్కరి అంచనాలు పెరిగాయని, ఈ భూగోళం బాగు కోసం ఇండియా ఏదైనా చేస్తుందన్న విశ్వాసం వారిలో పెరిగినట్లు చెప్పారు.
భారత్ నిజంగానే అవకాశాలు కల్పించే నేల అని, అనేక అవకాశాలు ఎదురుచూస్తున్నాయని, ఉత్సాహాంతో ఉరకలేస్తున్న ఈ దేశం.. ఎటువంటి అవకాశాల్ని వదలిపెట్టదని ఆయన స్పష్టం చేశారు. ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో 50 మంది ఎంపీలు మట్లాడారని, సుమారు 13 గంటల పాటు వారు అభిప్రాయాలను వెలిబుచ్చారని, వారంతా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారని, ఆ ఎంపీలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు మోదీ తెలిపారు.
కరోనా వేళ లాక్‌డౌన్ సమయంలో దీపాలు వెలిగించిన ఘటనను గుర్తు చేస్తూ.. కొందరు ఆ ఘటనలను వెక్కిరించారని ప్రధాని మోదీ అన్నారు. రోడ్డుపై గుడిసెలో ఉన్న వ్యక్తి దేశ క్షేమం కోసం దీపం వెలిగిస్తే.. అతన్ని మనం వెక్కిరిస్తున్నామని, ఎన్నడూ స్కూల్‌కు వెళ్లని ఓ వ్యక్తి ఈ దేశం కోసం దీపం వెలిగిస్తే, వారిని కొందరు ఆటపట్టిస్తున్నారని మోదీ ఆరోపించారు.
పోలియో, మసూచీ లాంటి వ్యాధులు భారత్ లో తీవ్ర ఉత్పాతాన్ని సృష్టించాయని, ఆ రోజుల్లో వ్యాక్సిన్ ఎవరికి అందుతుందో తెలియలేదని, కానీ ఇప్పుడు మన దేశం యావత్ ప్రపంచం కోసం వ్యాక్సిన్లు తయారు చేస్తున్నదని, ఇది మన ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నదని ప్రధాని మోదీ తెలిపారు. కోవిడ్ వేళ.. మన ఫెడరల్ వ్యవస్థ మరింత బలపడిందని, సహకార సమాఖ్యకు స్పూర్తిగా నిలిచామని పేర్కొన్నారు.
‘‘తెలియని శత్రువుతో భారత్ పోరాడింది. అయినా సరే కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకోగలిగాం. ఈ విజయం ఎవరి సొత్తూ కాదు. ఇది భారత దేశ విజయం. ఈ గర్వాన్ని మోయడంలో వచ్చిపడ్డ ఇబ్బందులేమి? సాధించిన విజయానికి ఉప్పొంగాలి. అంతేకానీ కుంగిపోయేలా వ్యాఖ్యానించకూడదు. దేశ ధైర్యాన్ని, విజయాన్ని సడలించే విధంగా మాట్లాడకూడదు.’’ అని మోదీ విపక్షాలకు చురకలంటించారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి