ట్రాక్టర్ ర్యాలీలో హింసపై జోక్యంకు సుప్రీం విముఖత 

ట్రాక్టర్ ర్యాలీలో హింసపై జోక్యంకు సుప్రీం విముఖత 

గణతంత్ర దినోత్సవాలనాడు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసాత్మక సంఘటనలపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు బుధవారం తిరస్కరించింది. ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని తెలిపింది.

సీజేఐ జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ, ఈ సంఘటనలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, చట్టం తన పని తాను చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రకటన‌ను చదివామని తెలిపారు. ఈ కేసులో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. 

రైతులను ఉగ్రవాదులుగా అభివర్ణించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది మనోహర్‌లాల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌‌లో, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ప్రకటించకుండా మీడియాకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రైతుల నిరసనలకు విఘాతం కలిగించేందుకు ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోందని పిటిషనర్ ఆరోపించారు. 

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న న్యూఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హింస చెలరేగింది. ఎర్ర కోటపై ఓ మతపరమైన జెండాను కొందరు ఎగురవేశారు. ఈ సంఘటనలపై త్రిసభ్య దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ కమిషన్‌కు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాయకత్వం వహించాలని, ఇద్దరు విశ్రాంత హైకోర్టు జడ్జీలను సభ్యులుగా నియమించాలని కోరారు. సాక్ష్యాధారాలను నమోదు చేసి, నివేదికను నిర్ణీత కాలంలో సుప్రీంకోర్టుకు సమర్పించే విధంగా ఈ కమిషన్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. 

కొత్త సాగు చట్టాల అమలును సుప్రీంకోర్టు గత నెలలో నిలిపేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ చట్టాలను అమలు చేయరాదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఇలా ఉండగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏర్పాటు చేసుకున్న బహిరంగ సభలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. రైతు నేతలు మాట్లాడుతుండగా సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. హర్యానాలోని జింద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన రైతుల సభకు పెద్ద ఎత్తున మహిళలు, రైతులు తరలివచ్చారు.

 భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ తికాయత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తికాయత్ వేదికనెక్కి రైతు నాయకులతో మాట్లాడుతుండగా.. వేదిక కూలిపోయింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.