దీప్ సిద్ధూ ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి

రైతుల నిరసనల్లో భాగంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడైన  దీప్ సిద్ధూ ఆచూకీ చెబితే లక్షరూపాయల బహుమతి ఇస్తామని ఢిల్లీ పోలీసులు బుధవారం ప్రకటించారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ఎర్ర‌కోటపై సిక్కు జెండాను ఎగుర‌వేసేందుకు సిద్ధూ మిగ‌తా వారిని ప్రేరేపించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆ ఘ‌ట‌న జ‌రిగినప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సిద్ధూ ఆచూకీ ల‌భించ‌లేదు.
 
సిద్దూతో పాటు జెండా ఎగుర‌వేసిన జుగ్‌రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్‌, గుర్జంత్ సింగ్‌పై రూ. ల‌క్ష రివార్డు ప్ర‌క‌టించారు. ఇంకో నలుగురు జాజ్బిర్ సింగ్‌, బూటా సింగ్‌, సుఖ్‌దేవ్ సింగ్‌, ఇక్బాల్ సింగ్‌పై రూ. 50 వేల రివార్డు ప్ర‌క‌టించారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో అల్లర్ల తర్వాతి నుంచి వీరంతా పరారీలో ఉన్నారు.
కిసాన్ ర్యాలీలో అల్ల‌ర్లకు కార‌ణ‌మైన 12 మంది ముఖ‌చిత్రాల‌ను ఢిల్లీ పోలీసులు విడుద‌ల చేశారు. ఈ 12 మంది క‌ర్ర‌లు ప‌ట్టుకుని దాడులు చేసిన‌ట్లు వీడియోల్లో క‌నిపించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల‌పై కూడా దాడులు చేసింది వీరేన‌ని తేలింద‌న్నారు. కిసాన్ ర్యాలీ అల్ల‌ర్లకు సంబంధించి మొత్తం 44 కేసులు న‌మోదు చేయ‌గా, 122 మందిని అరెస్టు చేశారు. ప‌లు రైతు సంఘాల నాయ‌కుల పేర్లు కూడా వివిధ కేసుల్లో న‌మోదు అయ్యాయి. ఇక జ‌ర్న‌లిస్టుల‌పై కూడా పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

 రైతుల నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఢిల్లీ ప‌రిసరాల్లో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. టిక్రి, సింఘూ వ‌ద్ద బారికేడ్ల‌ను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. రోడ్ల‌పై ఇనుప మేకుల‌ను ఏర్పాటు చేసి రైతుల నిర‌స‌న‌ల‌ను అడ్డుకుంటున్నారు పోలీసులు.