ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు త్వరలో మార్గదర్శకాలు

ఓవర్ ది టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫామ్స్‌కు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుంది. ‘తాండవ్’ వివాదంపై లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుంది. త్వరలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌‌కు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆదివారంనాడు ప్రకటించారు. 

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న పలు సీరియల్స్‌కు వ్యతిరేకంగా తమకు అనేక ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌లలో వస్తున్న సినిమాలు, సీరియల్స్, డిజిటల్ న్యూస్ పేపర్లు ప్రెస్ కౌన్సిల్ చట్టం కిందకు కానీ, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టం కిందకు కానీ, సెన్సార్ బోర్డు కిందకు కానీ రావని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓటీటీలకు సంబంధించి మార్గదర్శకాలను కేంద్రం తీసుకు వస్తుందని చెప్పారు.

వివాదాస్పద వెబ్ సిరీస్ ‘తాండవ్’ టీమ్‌పై ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, గ్రేటర్ నొయిడా, షాజహాన్‌పూర్ నుంచి మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో రెండు, కర్ణాటక, బీహార్‌లో చొరకటి ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. వీటితో పాటు, మహారాష్ట్ర, ఢిల్లీ, ఛండీగఢ్‌లో కనీసం మూడు క్రిమిషన్ ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి.