రైతుల ఆదాయం పెంచే కొత్త సాగు చట్టాలు 

నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త సాగు చట్టాలకు రైతుల ఆదాయం పెంచే శక్తీ ఉన్నదని  అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్ స్పష్టం చేశారు. అయితే.. రైతుల జీవికను కాపాడే వ్యవస్థలు ఉండాలని ఆమె సూచించారు. భారత వ్యవసాయ రంగంలో సంస్కరణల అవసరం ఉందని కూడా ఆమె స్పస్టం చేశారు. భారత్‌లో సాగు చట్టాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు గీతా గోపీనాథ్ ఈ మేరకు సమాధానమిచ్చారు.

 ‘ఈ సాగు చట్టాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించినవి. ఇవి రైతులకు అందుబాటులో ఉన్న మార్కెట్లను మరింత విస్తృత పరుస్తాయి. కేవలం వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా రైతులు తమ ఉత్పత్తులను అనేక మార్గాల్లో విక్రయించుకోవచ్చు.. అదీ కూడా ట్యాక్స్‌లు చెల్లించుకుండానే..! ఈ విధానం ద్వారా రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది’ అని ఆమె తెలిపారు. 

అయితే, .సంస్కరణలు తీసుకొచ్చిన ప్రతిసారీ.. ఈ మార్పుకు సంబంధించి కొంత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.  దీని వల్ల బలహీన వర్గాలు నష్ట పోకుండా అప్రమత్తత వహించాలని పేర్కొన్నారు. 

వారి జీవికకు భద్రత కల్పించే సామాజిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చెబుతూ ఈ దిశగా ఇప్పటికే చర్చ మొదలైందని ఆమె చెప్పారు. దీని వల్ల ఏ ఫలితం వస్తుందో తెలుసుకునేందుకు వేచి చూడాలని గీతా గోపీనాథ్ తెలిపారు.