దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన 6 రోజుల్లోనే 10 లక్షల మందికి టీకా వేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈనెల 16 నుంచి 24వ తేదీ ఉదయం దాకా మొత్తంగా 27,920 సెషన్లలో 15.82 లక్షల మంది వ్యాక్సిన్ ఇచ్చినట్లు వివరించింది. శనివారం ఒక్కరోజే 1.91 లక్షల మందికి టీకా ఇచ్చామంది.
అమెరికా, బ్రిటన్ కంటే వేగంగా, తక్కువ రోజుల్లోనే మన దేశంలో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపింది. తొలి 10 లక్షల మందికి టీకా వేసేందుకు బ్రిటన్‌లో 18 రోజులు, అమెరికాలో 10 రోజుల టైం పట్టిందని, భారత్ లో 6 రోజుల్లోనే వేశామని చెప్పింది. ఇప్పటిదాకా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 1,238 మందికి రియాక్షన్స్ వచ్చాయని తెలిపింది. మొత్తంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇది 0.08 శాతమేనని చెప్పింది. 11 మంది ( 0.0007%) మాత్రమే ఆస్పత్రిలో చేరారని వివరించింది.
శనివారం దాకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆరుగురు హెల్త్ కేర్ వర్కర్లు చనిపోయారని పేర్కొంది. అయితే వీరిలో ఎవరూ వ్యాక్సిన్ రియాక్షన్స్ వల్ల చనిపోలేదని స్పష్టం చేసింది. నమోదు చేసుకున్న వారంతా టీకా తీసుకుంటే వ్యాక్సిన్ వేస్టేజ్ కూడా తగ్గుతుందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం కొవిన్ డేటాబేస్‌లో కొన్ని మార్పులు చేశామని, ‘వాక్ ఇన్’ పద్ధతి ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.
కొవిన్‌లో ఒక నిర్దిష్ట తేదీకి స్లాట్ దక్కని ఆరోగ్య కార్యకర్తలు కూడా వచ్చి టీకాలు వేసుకోవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు కొంతమంది నేరుగా రావడం చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ఒక సారి వ్యాక్సిన్ సీసా ఓపెన్ చేశాక 4 గంటల్లోపు 10 మందికి ఇచ్చేయాలి.
ఒక వేళ 4 గంటల్లోపు 6 లేదా ఏడుగురే వస్తే మిగతా మూడు లేదా నాలుగు డోసులు వేస్ట్ అవుతాయి. అదే ఎక్కువ మంది వస్తే వేస్టేజీ తగ్గుతది. అలాగే నిర్ణీత సంఖ్యలో హెల్త్ వర్కర్లు రాకపోతే టీకా వేసేందుకు ఏర్పాటు చేసిన మ్యాన్‌పవర్ కూడా వేస్ట్ అవుతుందని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్పోక్స్ పర్సన్ ఛావి గుప్తా చెప్పారు.
మరోవంక, టెస్ట్, ట్రాక్, ట్రీట్, టెక్నాలజీ స్ట్రాటజీతో దేశంలో కరోనా కొత్త కేసులు, యాక్టివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఆదివారం నాటికి దేశంలో 1,84,408 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. శనివారం నుంచి ఆదివారం వరకు 24 గంటల వ్యవధిలో 14,849 కేసులు నమోదు కాగా, 15,948 మంది రికవర్ అయ్యారని చెప్పింది. డైలీ కేసుల్లో 75 శాతం కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, యూపీ, పశ్చిమ బెంగాల్లోనే నమోదవుతున్నాయని వెల్లడించింది.
More Stories
చైనా జాతీయుడికి `సుప్రీం’ బెయిల్ నిరాకరణ
బుల్డోజర్ న్యాయం ఆపేయమన్న సుప్రీంకోర్టు
కేరళలో నిపా కలకలం.. మరోసారి మాస్క్ తప్పనిసరి!